Begin typing your search above and press return to search.

జగన్ సీఎంగా 15వ అసెంబ్లీ అలా ముగిసింది...!

ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రమాణం చేసి 151 సీట్లలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీ అడుగుపెట్టిన 15వ అసెంబ్లీ గురువారంతో ముగిసింది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 12:10 PM GMT
జగన్ సీఎంగా 15వ అసెంబ్లీ అలా ముగిసింది...!
X

ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రమాణం చేసి 151 సీట్లలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీ అడుగుపెట్టిన 15వ అసెంబ్లీ గురువారంతో ముగిసింది. మొత్తం తొమ్మిది బిల్లులను ఈ సమావేశంలో ఆమోదించారు. ఓటాను అకౌంట్ బడ్జెట్ ని వచ్చే జూన్ వరకూ అంటే మూడు నెలల పాటు ఆమోదించారు. తిరిగి జూన్ లో తామే అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేయడంతో ఈ సభ చరిత్ర పుటలలోకి ఎక్కింది.

నాలుగు రోజుల పాటు సభా కార్యక్రమాలు సాగాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ తరువాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదించారు. బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. గురువారం దాని మీద చర్చ సాగింది. మొత్తానికి చాలా స్వల్పకాలిక కార్యక్రమాలతో సభ ముగిసింది

ఇలా 15వ అసెంబ్లీ ముగిసింది. ఇక 16వ అసెంబ్లీలో ఎవరు సీఎం అవుతారు అన్నది ఓటర్ల తీర్పు మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే 15వ అసెంబ్లీలో ఎన్నో చిత్రాలు చోటు చేసుకున్నాయి. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో విపక్ష పాత్రలోకి రావడం తన రాజకీయ అనుభవం అంత లేని జగన్ సీఎం గా ఉన్న సభలో తాను అపోజిషన్ గా ఉండడం ఇబ్బందికరంగా మారింది.

రెండున్నరేళ్ల పాటు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కానీ తన కుటుంబాన్ని అవమానించారు అంటూ చంద్రబాబు సభకు నమస్కారం పెట్టేసి బయటకు వచ్చేశారు. ఇక ఇదే సభలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారు. అలాగే వైసీపీ నుంచి నలుగురు టీడీపీ వైపు వచ్చారు.

అలా వచ్చిన వారిలో జగన్ అంటే ప్రాణం పెడతాను అన్న నెల్లూరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన జగన్ అంటే తనకు ప్రాణం కంటే అధికం అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. ఆ తరువాత ఆయన వైసీపీ నుంచే బయటకు వెళ్లిపోయారు.

మరో వైపు చూసుకుంటే తన గుండె జగన్ అంటుందని చెప్పిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా జగన్ కి హ్యాండ్ ఇచ్చి టీడీపీ శిబిరం వైపు వెళ్లిపోవడం ఇదే సభలో జరిగింది. ఇక జగన్ అన్నా కీర్తిస్తూ వచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలు టికెట్ దక్కకపోయేసరికి ముఖం చాటేసిన సభగా కూడా 15వ అసెంబ్లీ నిలుస్తుంది. జగన్ సైతం ఎమ్మెల్యేలు ఎవరైనా తాను ప్రజలనే నమ్ముకున్నాను అన్న తీరునే వ్యవహరించారు.

అలాగే 15వ సభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడంతో ఏపీ రాజకీయం మొత్తం ప్రకంపనలకులోను అయింది. తిరిగి అదే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకోవడం కూడా జరగడం మరో విశేషం. అనేక కీలక నిర్ణయాలు అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో తీసుకున్నారు. గ్రామ స్థాయిలో పాలనా సంస్కరణలకు కూడా నాంది పలికారు. అదే టైం లో ఈసారి అసెంబ్లీలో కొందరు సభ్యుల అనుచితమైన తీరు కూడా కనిపించింది.

విపక్ష నేత చంద్రబాబు సభలో అనేక సార్లు ఆగ్రహావేశాలకు లోను అయ్యారు. జగన్ సైతం ఒకటి రెండు సందర్భాలలో ఆవేశం ప్రదర్శించారు. ఇక ఎక్కువ సార్లు విపక్షం సభ నుంచి సస్పెండ్ కావడం 15వ అసెంబ్లీలోనే అంతా చూస్తున్నారు. అలాగే సభలో అధికార పక్షం విపక్షం ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటే ఎవరో ఒకరు సభకు దూరంగా ఉండాల్సిందే అన్న తీరు 14వ సభ నుంచి కొనసాగుతూ వస్తోంది. అపుడు వైసీపీని ఎక్కువ సార్లు సస్పెండ్ చేస్తే ఇపుడు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.

ఆనాడు జగన్ సభకు నమస్కారం అంటే ఇపుడు చంద్రబాబు అదే పని చేశారు. స్పీకర్ల పనితీరు మీద విమర్శలు కూడా 14, 15 అసెంబ్లీ లలోనే ఎక్కువగా వచ్చాయి. ఇక జనసేన 15వ అసెంబ్లీలో రికార్డులకు ఎక్కింది. అయితే ఆ పార్టీ అధినేత పవన్ మాత్రం 15వ శాసన సభలో కనిపించలేకపోయారు. ఆయన 16వ శాసన సభలో కనిపిస్తారు అని అభిమానులు అంటున్నారు. మొత్తం మీద చూస్తూండగానే గిర్రున అయిదేళ్ల కాలం ముగిసి 15వ అసెంబ్లీ చరిత్రలోకి వెళ్లిపోయింది.