తల్లిని ప్రశంసించి.. చెల్లిని మరిస్తే ఎలా జగనన్నా..?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో యువ విభాగ సమావేశాన్ని నిర్వహించారు.
By: Tupaki Desk | 1 July 2025 1:18 PMమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో యువ విభాగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... పార్టీ ఏర్పాటు నుండి 2024 ఎన్నికల వరకు పార్టీ ప్రయాణం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకున్న జగన్ చెల్లి గురించి ప్రస్థావించకపోవడం గమనార్హం.
అవును... పార్టీ కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్ మీటింగ్ ఏర్పాటు చేశారు జగన్. ఈ సందర్భంగా రాజకీయాల్లో తన అనుభవాలను, వైసీపీ ప్రస్థావాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. కీలక క్షణాలను, పలు మైలురాళ్లను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా... వైఎస్సార్ కుటుంబానికి జరిగిన అన్యాయం వల్లే తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... యూత్ వింగ్ కు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా... పార్టీలో యూత్ వింగ్ చాలా క్రియాశీలకమైనదని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని చెప్పిన జగన్... పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని.. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే.. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే అని చెప్పిన జగన్.. పార్టీ పెట్టిన కొత్తలో తాను, అమ్మ మాత్రమే ఉన్నామని.. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు కలిసి వచ్చారని.. అక్కడ నుంచి తన ప్రస్థానం మొదలయ్యిందని జగన్ వెల్లడించారు. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ రావడంతో దాన్ని జీర్ణించుకోలేక మన మీద పగబట్టారని అన్నారు.
ఏది ఏమైనా.. ఎన్నికష్టాలు వచ్చినా.. విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామని.. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదని చెప్పిన జగన్... ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యమని.. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని యూత్ వింగ్ కు సూచించారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ... పార్టీ ప్రారంభించినప్పుడు తనతో పాటు తల్లి విజయమ్మ మాత్రమే ఉందని చెప్పిన జగన్.. తనను వ్యక్తిగతంగా అభిమానించనవాళ్లు తనతో పాటు వచ్చారని పలికిన జగన్.. ప్రారంభ రోజుల్లో పార్టీ కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, తాను వదిలిన బాణం షర్మిలను గుర్తు చేసుకోకపోవడంపై భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా... ప్రస్తుత రాజకీయ, ఆస్తి వివాదాలు ఉన్నప్పటికీ.. ఆమె సహకారాన్ని జగన్ ఒకసారి గుర్తు చేసుకుని ఉంటే కాస్త హుందాగా ఉండేదని.. వైసీపీ తొలినాళ్లలో కీలకంగా పనిచేసిన ఆమె పాత్రను పూర్తిగా విస్మరించడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.