'జగన్' కళ్లలో ఆనందం నింపేదెవరు ..!
ఏ పార్టీలో అయినా.. అధినేత ఆనందం కోసం నాయకులు, నాయకుల ఆనందం కోసం కార్యకర్తలు పనిచేస్తారు. అలానే.. వైసీపీ లోనూ పార్టీ అధినేత జగన్ ఆనందం కోసం నాయకులు అనేక మంది పనిచేస్తున్నారు.
By: Garuda Media | 30 April 2026 7:00 AM ISTఏ పార్టీలో అయినా.. అధినేత ఆనందం కోసం నాయకులు, నాయకుల ఆనందం కోసం కార్యకర్తలు పనిచేస్తారు. అలానే.. వైసీపీ లోనూ పార్టీ అధినేత జగన్ ఆనందం కోసం నాయకులు అనేక మంది పనిచేస్తున్నారు. కానీ, ఆయన కళ్లలో ఆనందం చూడలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం.. కీలకమైన నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కకపోవడమే. ముఖ్యంగా మూడు నాలుగు నియోజకర్గాల్లో ప్రత్యర్థులను దారుణంగా ఓడించాలన్నది జగన్ లక్ష్యం. దీనికి సంబంధించి అధికారంలో ఉండగా.. పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేశారు. కీలక నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ, ఫలించలేదు.
ఉదాహరణకు..
కుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఆయనను ఓడించాలన్నది జగన్ పెట్టుకున్న కీలక లక్ష్యం. దీంతో వైఈపీ అధికారంలోకి రాగానే.. కుప్పంపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేశారు. కుప్పాన్ని సెకండరీ గ్రేడ్ మునిసిపాలిటీగా ప్రకటించారు. భారీ ఎత్తున అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో టీడీపీ అనుకూల ఓట్లను తొలగించేలా చేశారన్న వాదన కూడా ఉంది. అంతేకాదు.. కృష్ణానది నీటిని కూడా ఈ నియోజకవర్గానికి పారించారు. జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ క్రమంలోనే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సహా.. అనేక మంది నాయకులకు బాధ్యతలు అప్పగించారు. కానీ,.. వారెవరూ జగన్ కళ్లలో ఆనందం నింపలేక పోయారు.
టెక్కలి: జగన్ పెట్టుకున్న రెండో లక్ష్యం.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడును ఓడించడం. దీనిపైనా ఆయన పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నను ఓడించి.. తద్వారా.. గతంలో తనపై కేసులు పెట్టేలా చేశారన్న వాదన ఉన్న కింజరాపు కుటుంబంపై కసి తీర్చుకోవాలన్నది జగన్ లక్ష్యంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే టెక్కలి నియోజకవర్గంలో అనేక ప్రయోగాలు చేశారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అభ్యర్థులను మార్చారు. భారీ ఎత్తున నిధులు కూడా ఇచ్చారు. కానీ.. ఎవరూ జగన్ కళ్లలో ఆనందం నింపలేదు.
మంగళగిరి: తనపై నిరంతరం.. విమర్శలు గుప్పించడంతోపాటు.. తనపై సెటర్లు వేసే టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ను అసలు అసెంబ్లీలో అడగు పెట్టకుండా చేయాలన్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేసిందని అంటారు. ఈ క్రమంలో నే 2019లోను, 2024లోనూ మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమికి.. వైసీపీ శాయశక్తులా ప్రయత్నాలు చేసింది. గతంలో టీడీపీలో పనిచేసిన వారిని .. ఏరికోరి పార్టీలో చేర్చుకుంది. కీలక పదవులు కూడా కట్టబెట్టింది. స్థానికంగా బలంగా ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన మహిళకు టికెట్ ఇచ్చి.. సెంటిమెంటు అస్త్రాన్ని కూడా ప్రయోగించింది. ఈ క్రమంలో 2019లో లోకేష్ విజయాన్ని నిలువరించినా.. 2024లో మాత్రం నిలువరించలేక పోయారు. ఫలితంగా.. జగన్ కళ్లలో ఆనందం మటుమాయమైంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే.. అందరూ మౌనంగా ఉన్నారు.
