నేతల కష్టం: అక్కడ వైసీపీకి నేతల కరువు.. !
వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలపై కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు నేతల నోటి దురుసు వ్యాఖ్యలు కారణంగా పార్టీ సంస్థాగతంగా దెబ్బతింటుంది.
By: Tupaki Desk | 9 July 2025 10:00 PM ISTవైసీపీ అధినేత జగన్‌కు కష్టాలపై కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు నేతల నోటి దురుసు వ్యాఖ్యలు కారణంగా పార్టీ సంస్థాగతంగా దెబ్బతింటుంది. సానుభూతి కూడా కరువవుతుంది. నిజానికి వైసీపీని సమర్థించేందుకు నాయకులు బయటికి వచ్చినా రాకపోయినా ఒక వర్గం సోషల్ మీడియా మాత్రం జగన్ కోసం పనిచేస్తుంది. మరి జగనన్న వాళ్ళకి ఏమిస్తున్నారు? ఏమి ఇవ్వట్లేదు? అనేది పక్కన పెడితే అంకితభావంతో పనిచేస్తున్న సోషల్ మీడియా కూడా తాజాగా ఎదురవుతున్న సమస్యల కారణంగా జగన్‌కు అనుకూలంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక నియోజకవర్గాల స్థాయిలో ఇటీవల కొంతమంది ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించారు. వారు కూడా అసలు నియోజకవర్గాల మొహం చూడని పరిస్థితి నెలకొంది. మరి అంతర్గతంగా వారికి ఉన్న అసంతృప్తి లేదా పార్టీపై ఉన్న అసంతృప్తి అని అనుకోవాలో లేకపోతే మరే కారణమో తెలియదు గానీ నాయకులు కరువయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి మూడు మాసాలు అయింది.
కానీ ఇప్పటివరకు ఆయన ఒక అడుగు కూడా విజయవాడలో పెట్టలేదు. కనీసం పార్టీ నాయకులతో టచ్లోకి కూడా రాలేదు. ఇదే సమయంలో కనీసం ఆయన పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపించడం లేదు. జగన్ వెంట అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్నా ఆయన పర్యటనలో పాల్గొంటున్నా మోదుగుల మాత్రం నోరు మెదపడం అనేది కష్టంగా మారింది. మరి ఆయనకున్న కారణాలు ఏంటనేది తెలియాలి. ఇక, కీలకమైన విజయవాడ విషయానికి వస్తే ఇక్కడ ఇన్చార్జిగా మోదుగుల కనీసం పార్టీ తరపున ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
పార్టీ నాయకులను సమీకరించడం వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవడం నియోజకవర్గం లో పార్టీని ఎలా డెవలప్ చేయాలన్న అంశంపై వారితో చర్చించడం అంటివి కూడా ఇప్పటివరకు చేయలేదు. కనీసం విజయవాడలోకి ఆయన రాను కూడా రాలేదు. దీంతో మోదుగుల వల్ల ఏంటి ప్రయోజనం అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు, మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ రావు కూడా పార్టీకి దూరంగానే ఉన్నారు.
ఆయన పార్టీ మారతారు అన్న చర్చ కూడా తెరమీదకి రావడం విశేషం. అయితే పార్టీ మారే అవకాశం లేదు. కానీ పార్టీకి మాత్రం దూరంగా ఉండడం ఇప్పుడు అందరిలోనూ చర్చగా మారింది. ఏమాత్రం ఆయన నోరు విప్పినా.. కేసులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భయపడుతున్నారో లేక తనను గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్చారన్న అసంతృప్తి వెంటాడుతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన పార్టీకి చాలా దూరంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వ్యవహరించడం వంటివి అంతర్గతంగా వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాలపై చర్చ నడిచేలా చేసింది.
