Begin typing your search above and press return to search.

జగన్ పట్టించుకోని మూడు అంశాలు.. వైసీపీ అంచనాలు తిప్పుతోందా?

ప్రభుత్వ వ్యతిరేకతపై నమ్మకం పెట్టుకున్న విపక్ష నేత మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంశాన్ని ఈ మూడు అంశాలు నిర్ణయిస్తాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2025 9:00 PM IST
జగన్ పట్టించుకోని మూడు అంశాలు.. వైసీపీ అంచనాలు తిప్పుతోందా?
X

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఎన్నికలకు మరో నాలుగేళ్ల వ్యవధి ఉంది. అయితే జమిలి వస్తే ఏడాది ముందే ఎన్నికలు జరుగుతాయని ప్రతిపక్ష నేత జగన్ ఊహిస్తున్నారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుందని వైసీపీ అధినేత జగన్ బలంగా నమ్మడంతోపాటు.. పార్టీ శ్రేణులకు ఆ దిశగానే ధైర్యం చెబుతున్నారు. అయితే ప్రతిపక్షంగా చేయాల్సిన కార్యక్రమాలు వదిలేసి ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని, మూడేళ్లు ఆగితే మనదే ప్రభుత్వం అంటూ వైసీపీ బాస్ జగన్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతపై నమ్మకం పెట్టుకున్న విపక్ష నేత మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంశాన్ని ఈ మూడు అంశాలు నిర్ణయిస్తాయని అంటున్నారు.

జగన్ మరోమారు అధికారంలోకి రావాలంటే మూడు ప్రధాన అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అంటున్నారు. అందులో ప్రధానమైనది ప్రభుత్వ వ్యతిరేతకపై వైసీపీ తన అభిప్రాయాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ భావిస్తోంది. తొలి ఏడాదిలో రాష్ట్రం ఆర్థికంగా కుదురుకోడానికి కొంత సమయం కావాలని సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు ఆపేశారని ఆ పార్టీ వాదిస్తోంది. వైసీపీ వాదనలో నిజమున్నా, ఏడాది పూర్తయిన తర్వాత కూడా ఇదే అంచనాలు వేయడం కరెక్టు కాదంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే తల్లికివందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి డబ్బులు పడ్డాయని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతోపాటే అన్నదాతా సుఖీభవ పథకం నిధులు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. మరోవైపు వచ్చేనెల 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు అవ్వనుందని గుర్తు చేస్తున్నారు. ఇలా సంక్షేమ పథకాలు అమలు అయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైన హామీల్లో 20 లక్షల ఉద్యోగ నియామకాలు ఒకటి. ఈ హామీ కూడా కొంతవరకు నెరవేరే పరిస్థితి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, దీనిద్వారా వచ్చే మూడు నాలుగేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు అన్నీ గ్రౌండింగ్ అవ్వకపోయినా, అందులో సగమే ఆచరణలోకి వచ్చినా రెండు నుంచి మూడు లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత అన్న వైసీపీ వాదన నీరసించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక గత ఎన్నికల్లో దెబ్బతిన్న తమ పార్టీ వచ్చే మూడేళ్లలో పుంజుకుంటుందని జగన్ ఊహిస్తున్నారు. అయితే ఇప్పటికీ వైసీపీకి 40 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ ఓట్ల శాతం పెంచుకోవాల్సివుందని అంటున్నారు. ప్రస్తుతం అధికార కూటమిలో టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ఐకమత్యంగానే ఉన్నాయి. మూడు పార్టీలు చక్కని సమన్వయంతో పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామంటున్నాయి. అంటే ఆయా పార్టీల ఓటు బ్యాంకు చెక్కు చెదిరే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ పార్టీ పుంజుకోవాలంటే కూటమి ఓటు బ్యాంకును ఆకర్షించడంతోపాటు కొత్త వర్గాలకు చేరువ అవ్వాల్సివుంటుందని అంటున్నారు. ఏడాదిగా ఈ దిశగా పనిచేయకపోవగా, పార్టీ నుంచి నేతలు వలస వెళ్లడాన్ని అరికట్టకపోవడం కూడా వైసీపీకి దెబ్బే అంటున్నారు. దీంతో రెండో అంశంలోనూ వైసీపీ అధినేత వైఖరి మారాల్సివుందని అంటున్నారు.

చివరగా పార్టీని క్రమశిక్షణగా నడపడం కూడా ముఖ్యమన్న భావన వ్యక్తమవుతోందని అంటున్నారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా ఉండాల్సిన అవసరం చాలా ముఖ్యమని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీలో మెజార్టీ నేతలు హుందాతనాన్ని కోల్పోవడం వల్లే ఆ పార్టీకి గత ఎన్నికల్లో నష్టం జరిగిందని అంటున్నారు. అయితే తమ నోటి దురుసు వల్లే పార్టీ అధికారం కోల్పోయిందన్న విషయాన్ని ఇప్పటికీ చాలా మంది గుర్తించడం లేదని అంటున్నారు. విపక్షంలో ఉన్నా అదే దురుసు ప్రవర్తనతో ప్రజల్లో చులకన అవుతున్నారనే వాదన వినిపిస్తోందని చెబుతున్నారు. అధినేత ఈ అంశంపైనా దృష్టి పెట్టి పార్టీ నేతలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ మూడు అంశాల ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ దిశగా సరైన చర్యలు తీసుకుంటేనే వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు మంచి రోజులు వస్తాయని అంటున్నారు.