జగన్ 2.0 వేరుగా ఉంటుంది.. కార్యకర్తలకు జగనన్న భరోసా
జగన్ 2.0లో కార్యకర్తలకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో చూస్తారని చెప్పారు.
By: Tupaki Desk | 1 May 2025 9:37 PM ISTజగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని పిఠాపురం, కుప్పం, కదిరి, మార్కాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలో 19 వార్డులను వైసీపీ గెలుచుకుంటే.. అన్యాయంగా మున్సిపల్ చైర్మన్ పీఠం లాక్కున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం నుంచి ఎన్ని వేధింపులు వస్తున్నా కార్యకర్తలు తెగువతో పోరాడుతున్నారని కొనియాడారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో చూస్తారని చెప్పారు. కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు సార్లు సీఎంగా పనిచేసినా తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు. కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసింది, రెవెన్యూ డివిజన్ చేసిందీ వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. చివరికి కుప్పం నియోజకవర్గానికి మంచినీటిని కూడా చంద్రబాబు సరఫరా చేయలేకపోయారని విమర్శించారు.
తమ ప్రభుత్వంలోనే కుప్పం అభివృద్ధి చేశామని జగన్ వివరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్, మండల పరిషత్ ఉప ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని బలం లేకపోయినా టీడీపీ చైర్మన్ పదవులను లాక్కుందని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. పోలీసులను వాచ్ మన్లకన్నా హీనంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమైన అంశమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
