వైసీపీలో సర్ భయం...అక్కడే అంతా ?
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ నేతల పోరాట పటిమను చూస్తాను అని జగన్ కచ్చితంగా చెబుతున్నారు.
By: Satya P | 29 May 2026 1:51 AM ISTవైసీపీకి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ భయం పట్టుకుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే మొత్తం 175 మంది అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ లను పిలిచి మరీ వైసీపీ అధినేత జగన్ ఒక్కటే మాట చెప్పారు. సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన గట్టిగానే హెచ్చరించారు. సర్ పేరుతో జరిగే ఓటర్ల జాబితా సవరణలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు పోకుండా చూసుకోవాలని పార్టీ వర్గాలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
స్టాలిన్ మమత అంటూ :
ఇదే సందర్భంలో జగన్ రెండు ఉదాహరణలు కూడా ఇచ్చారు. తమిళనాడులో 40 లక్షలకు పైగా ఓట్లను తొలగిస్తే 17 లక్షల ఓట్ల తేడాతో స్టాలిన్ ఓటమి చెందారు అని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాలో మమతా బెనర్జీ కూడా 30 లక్షల ఓట్ల తేడాతో ఓడితే సర్ పేరుతో అక్కడ అంతకు రెండింతలు ఓట్లు తొలగించారు అని కూడా చెప్పారు. అధికారంలో ఉంటూ కూడా ఆ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఓడారని జగన్ అంటున్నారు. అంతే కాదు ఉన్న ఓట్లు తగ్గించినా లేక కొత్తగా ఎక్కువగా ఓట్లు పెంచినా కూడా వైసీపీకి నష్టమే అని కూడా పార్టీ నాయకులకు వివరించారు. అందుకే సర్ పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలని జగన్ కోరుతున్నారు.
ఉదాశీనత వద్దు :
వైసీపీకి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఇంచార్జిలు సర్ విషయంలో పూర్తి అవగాహన పెంచుకుని అక్కడ పార్టీ మొత్తాన్ని ఆ దిశగా నడిపించాలని వైసీపీ ఓట్లు పోకుండా చూడడం ఒక కర్తవ్యం అయితే భోగస్ ఓట్లు తీయించేయడం మరో లక్ష్యం కావాలని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. అందుకే బూత్ లెవెల్ లో ఉన్న కార్యకర్తలను పూర్తిగా అప్రమాత్తం చేయాలని జగన్ కోరారు. ఇప్పటి నుంచే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకోకపోతే దెబ్బ తింటామన్న సంగతిని కూడా పార్టీ నేతలకు బాగా అర్థం అయ్యేలా జగన్ చెప్పారని అంటున్నారు.
స్థానిక సంస్థలు టార్గెట్ :
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ నేతల పోరాట పటిమను చూస్తాను అని జగన్ కచ్చితంగా చెబుతున్నారు. రానున్న కాలంలో పార్టీని ఎలా నడిపిస్తారో తెలియదు కానీ లోకల్ బాడీస్ లో విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా ఫైట్ చేయాల్సిందే అని కూడా జగన్ సూచించారు అలా ఇంచార్జిలు తెగించి కష్టపడితేనే వారికి పార్టీలో ఫ్యూచర్ ఉంటుందని కూడా జగన్ స్పష్టంగానే చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ సర్ విషయంలో అయితే గట్టిగానే హెచ్చరికలు చేశారు. అలెర్ట్ గా ఉండాలని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంలో భాగం అందుకే సర్ విషయంలో వైసీపీకి అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఒకింత కలవరం చెందుతోంది అని అంటున్నారు.
