జగన్ వార్నింగ్...చంద్రబాబు ఎక్స్ పీరియన్స్ పనిచేయడం లేదా ?
చంద్రబాబు అంటేనే అపర చాణక్యుడు అని అంటారు. ఆయన రాజకీయం ముందు ఎవరైనా బలాదూర్. తిమ్మిని బమ్మిగా చేయగల సామర్థ్యం ఆయన సొంతం అని అంటారు.
By: Satya P | 30 Dec 2025 9:30 AM ISTచంద్రబాబు అంటేనే అపర చాణక్యుడు అని అంటారు. ఆయన రాజకీయం ముందు ఎవరైనా బలాదూర్. తిమ్మిని బమ్మిగా చేయగల సామర్థ్యం ఆయన సొంతం అని అంటారు. బాబు ముందు నిలువలేక మహామహులు ఓటమి చెందిన చరిత్ర కళ్ళ ముందే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే విముఖుడిని సైతం సుముఖుడిగా చేయగల సత్తా బాబుకే ఉంది అంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ బాబుకి ఉన్న రాజకీయ అనుభవం కానీ ఆయన వ్యూహ చతురత కానీ ఎవరికీ లేవు అన్నది కూడా అంతా ఒప్పుకునే విషయం. సంక్షోభం నుంచి సవాళ్ళ నుంచి తన విజయాలకు సోపానాలు చేసుకోగల సమర్ధుడు అయిన బాబుకు ఇపుడు చేతిలో అధికారం ఉంది. కేంద్రంలో కూడా ఆయన హవానే నడుస్తోంది. ఇంత ఉన్నా కూడా బాబు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అన్నదే ఇపుడు పెద్ద చర్చ.
జగన్ హెచ్చరిస్తే సరి :
వైసీపీ అధినేత జగన్ పీపీపీ విషయంలో అయితే మీడియా సాక్షిగా భారీ హెచ్చరికలే జారీ చేశారు. ప్రభుత్వ రంగంలో కట్టాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగంలో పీపీపీ విధానంలో కడితే ఒప్పుకోను అని ఆయన చాలా కాలంగా మాట్లాడుతున్నారు కోటి సంతకాల సేకరణ అని కూడా వైసీపీ చేపట్టింది. ఇక అల్టిమేట్ అన్నట్లుగా జగన్ గవర్నర్ ని కలిసి వచ్చిన తరువాత పీపీపీలకు ఎవరైనా టెండర్లు వేసి వాటిని తీసుకున్నారో తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏకంగా జైళ్ళకే పంపుతామని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. టెండర్లు వేయండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి ఆ మీదట మీ ఇష్టం రేపటి రోజున అధికారం మాదే అపుడు మేము వస్తే అరెస్టులు జైళ్ళే అని జగన్ చేసిన బిగ్ సౌండ్ ఏపీ రాజకీయాలలో చర్చగా రచ్చగా మారింది.
మూడున్నరేళ్ళ ముందే :
ఎన్నికలు జరిగి ఏణ్ణర్థం అయింది. ఇంకా కూటమి చేతిలో మూడున్నరేళ్ల అధికారం పదిలంగా ఉంది. అపుడే 2029 ఎన్నికలు మాదే అధికారం అని జగన్ అంటున్నారు. అంతే కాదు అరెస్టులు జైళ్ళు అని కూడా అంటున్నారు. మరి జగన్ ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడమేంటి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఎవరూ బిడ్ దాఖలు చేయకపోవడమేంటి ఇదే ఇపుడు మరో రకం చర్చగా ఉంది. నిజానికి ఈ ఏణ్ణర్ధంలో వైసీపీ అపొజిషన్ గా పెద్దగా పెర్ ఫార్మ్ చేసింది లేదని అంటున్నారు కూటమి చూస్తే పవర్ ఫుల్ గా ఉంది. మూడు పార్టీలు కలసి ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. పైగా నరేంద్ర మోడీ సర్కార్ కూడా పీపీపీకి సై అంటోంది. ఇంతటి పాజిటివిటీ ఉన్నా కూడా టెండర్లు వేయడానికి జడిసి ఎవరూ రావడం లేదా లేక మరేమైనా జరుగుతోందా అసలు సీఎం విజనరీగా ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఏమి చేస్తున్నారు ఏమాలోచిస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా ఉంది మరి.
అరెస్టు చేసే చాన్స్ ఉందా :
నిజం చెప్పాలీ అంటే పీపీపీ మోడల్ అన్నది దేశంలో కొత్త ఏమీ కాదు పైగా మెడికల్ కాలేజీల విషయంలో చాలా రాష్ట్రాలు ఇదే విధానం అనుసరిస్తున్నాయని అంటున్నారు. పార్టీ ఎవరైనా ప్రభుత్వం ఎపుడూ ఒక్కటే. అది బాబుదా జగన్ దా అన్నది ఉండదు, బాబు ప్రభుత్వం టెండర్లను పిలిచి పీపీపీకి ఒప్పందాలు చేసుకుంటే జగన్ అధికారంలోకి వచ్చినా చేసేది ఏమీ ఉండదని అంటున్నారు ఎందుకంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే చూస్తారు. పైగా రూల్స్ అన్నీ ఫ్రేమ్ చేసి మరీ పీపీపీకి ఇస్తారు. అలాంటపుడు ఎవరూ భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఎందుకు జగన్ వార్నింగ్ తరువాత టెండర్ల విషయంలో ఎవరూ ముందుకు రావడం లేదు అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది.
బాబు తలచుకుంటే :
చంద్రబాబు తలచుకుంటే ఎవరిని అయినా రప్పించగలరు, ఆయన దేశ విదేశాలలో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంచి రిలేషన్స్ ని మెయిన్ టెయిన్ చేస్తారు. ఆయనకు బిజినెస్ టైకూన్స్ తోనే మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా పెట్టుబడులు రప్పించడం కానీ పెట్టించడం కానీ బాబుకు అలవాటు అయిన విధానమే. ఆయన ఒక్క మాట చెబితే చాలు పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది తయారుగా ఉంటారు. అక్కడ ఉన్నది ప్రభుత్వమా కాదా అన్నది కూడా చూడరు, బాబు చెప్పారు అంతే అన్న నమ్మకంతో ఏమైనా చేస్తారు. అలాంటిది జగన్ వార్నింగ్ తో ఆగిన టెండర్ల విషయంలో బాబు ఏమి చేస్తున్నారు అన్నది అంతా ఆలోచిస్తున్నారు. బాబు కనుక తలచుకుంటే చిటికలో పని కదా అని అన్న వారూ ఎంతో మంది ఉన్నారు. బాబు అనుభవం అపారం అలాంటి బాబు ఎక్స్ పీరియన్స్ జగన్ వార్నింగ్ ముందు పనిచేయడం లేదా అన్నది చాలా మందిని దొలిచేస్తున్న ప్రశ్న. నిజంగా అలాగే జరుగుతోందా లేక బాబు ఇంకా ఏమైనా కొత్త వ్యూహంతో ఉన్నారా ఏమిటి దీని వెనక మతలబు అని అనుకుంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి చూస్తే పీపీపీ అని ప్రభుత్వం అంటే డుం డుం డుం అని జగన్ వార్నింగ్ ఇవ్వడమేంటో అన్నదే బిగ్ డిబేట్ గా ఉంది.
