Begin typing your search above and press return to search.

జగన్ స్ట్రాటజీ పవన్ అప్లై చేస్తున్నారా ?

మేము కూడా ఆయన పేరు ఎత్తకుండానే విమర్శలు చేస్తామని కూడా చెప్పేవారు.

By:  Tupaki Desk   |   28 March 2025 10:43 PM IST
జగన్ స్ట్రాటజీ పవన్ అప్లై చేస్తున్నారా ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్థి పార్టీల అధినేతలను విమర్శించేవారు కానీ వారి పేర్లు మాత్రం ఎక్కడా పలికే వారు కాదు. మరీ ముఖ్యంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పట్టుకుని దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని ట్యాగ్స్ పెట్టి విమర్శించేవారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ అని అనేవారు కాదు. దీని మీద జనసేన నేతలు కూడా అప్పట్లో కామెంట్స్ చేస్తూ వచ్చేవారు. మేము కూడా ఆయన పేరు ఎత్తకుండానే విమర్శలు చేస్తామని కూడా చెప్పేవారు.

ఇక ఇపుడు చూస్తే అధికారం అటు నుంచి ఇటు మారింది. జగన్ మాజీ సీఎం అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎటూ అధికారంలో ఉన్న వారి మీదనే విమర్శలు చేయడం సహజం. ఆ విధంగా చూస్తే విపక్ష హోదాలో జగన్ చంద్రబాబు మీద పవన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎందుకో ఇపుడు పవన్ పేరుని పలుకుతున్నారు. ఆ విధంగా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు.

ఆ మధ్యన పవన్ ని పట్టుకుని కార్పోరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని ఘాటైన సెటైర్ వేశారు జగన్. ఇపుడు చూస్తే కాశీనాయన ఆధ్యాత్మిక సత్రాన్ని కూల్చివేశారని అయినా పవన్ కి పట్టలేదంటూ సుదీర్ఘమైన ట్వీట్ ని ఎక్స్ లో పెట్టారు. ఇలా పవన్ ని టార్గెట్ చేస్తూ జగన్ మాట్లాడుతున్నా విమర్శలు చేస్తున్నా పవన్ నుంచి అయితే రియాక్షన్ రావడం లేదు.

కార్పోరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటే జనసేన ఆవిర్భావ సభలో పవన్ తప్ప అంతా జగన్ ని కౌంటర్ చేస్తూ గట్టిగానే విమర్శించారు. కానీ అదే సభలో మాట్లాడిన పవన్ అయితే జగన్ పేరు ఎత్తకుండానే ప్రసంగం మొత్తం చేశారు. ఇక లేటెస్ట్ గా కాశీనాయన మఠం మీద కామెంట్స్ కి కూడా పవన్ నుంచి నేరుగా కౌంటర్లు వచ్చేది ఉండదని అంటున్నారు.

పాలిటిక్స్ లో ప్రత్యర్ధులను పేరు ఎత్తకుండా ఇగ్నోర్ చేయడం కూడ ఒక రకమైన స్ట్రాటజీ. దానిని గతంలో జగన్ అనుసరిస్తే ఇపుడు పవన్ అదే అప్లై చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. దీనివల్ల ప్రత్యర్ధుల విషయంలో తమదైన ట్రీట్మెంట్ ఇదే అని చెప్పకనే చెప్పినట్లు అన్న మాట.

అధికారంలో ఉన్న వారు ఏది మాట్లాడినా అది వైరల్ అవుతుంది. అందుకోసం కూడా వారు సహనంతో ఉంటారు. ప్రత్యర్ధులకు అనవసరంగా మైలేజ్ ని ఇచ్చేందుకు ఇష్టపడరు. కానీ విపక్షంలో ఉన్న వారు మాత్రం అధికార పక్షాన్ని ఫోకస్ చేస్తూ వారిని ఎండగట్టాలని చూస్తారు. తద్వారా జనంలో నానాలని భావిస్తారు. అయితే ఈ ఎత్తులూ వ్యూహాలు ఇపుడు వైసీపీకే తిప్పికొడుతూ జనసేన కూడా టిట్ ఫర్ టాట్ అంటోందా అన్నదే చర్చగా ఉంది.