లోకేష్ తో జగన్ డిబేట్... ఎలా ఉంటుంది ?
వైసీపీ అధినేత మాజీ సీఎం ఒకరు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రిగా మరొకరు ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పదేళ్ళు ఉంది.
By: Tupaki Desk | 3 Jun 2025 8:43 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం ఒకరు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రిగా మరొకరు ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పదేళ్ళు ఉంది. రాజకీయంగా చూస్తే ప్రత్యర్థులు వారే వైఎస్ జగన్, నారా లోకేష్. ఇక జగన్ సీఎం అయ్యారు. మరోసారి ఆ సీటు కోసం తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
నారా లోకేష్ టీడీపీకి భావి నాయకుడు. ఆయన భవిష్యత్తు సీఎం గా ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉన్నారు. ఇద్దరి తండ్రులూ చంద్రబాబు వైఎస్సార్ ఒకనాటి మిత్రులు తరువాత కాలంలో రాజకీయ ప్రత్యర్ధులు. ఇక నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం రెండు కుటుంబాల మధ్య ఉంది. ఇక కడప చిత్తూరు పక్క పక్క జిల్లాలే. అంతే కాదు రెండు కుటుంబాలు సీమకు చెందినవే.
పంతాలు పట్టింపులలో ఎవరూ ఎవరికీ తీసిపోరు. చిత్రమేంటి అంటే నారా లోకేష్ జగన్ ఎక్కడా పెద్దగా ఎదురుపడింది లేదు. జగన్ సీఎం అయ్యాక ఒక్కసారి శాసనమండలికి వెళ్ళారు ఆ సమయంలో మండలి లో సభ్యుడు లోకేష్. జగన్ విపక్షం బెంచీల వైపు రాగానే లోకేష్ లేచి నిలుచుని జగన్ కి గౌరవ సూచకంగా అభివాదం తెలిపారు. జగన్ సైతం ఆయనతో పాటు అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
అంతే అంతకు మించి ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం అయితే మరొకటి లేదు అని చెప్పాలి. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి నారా లోకేష్ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ప్రతీ విషయం మీద ట్వీట్ చేస్తూ జగన్ కి సవాల్ విసురుతున్నారు. తాజాగా ఉర్సా వివాదం మీద కూడా లోకేష్ ఓపెన్ చాలెంజ్ చేశారు.
ఇక చంద్రబాబు అయితే పెద్ద మనిషిగా ఉంటూ లోకేష్ నే జగన్ మీదకు ప్రయోగిస్తున్నారు. ఇక ఇద్దరూ ఫ్యూచర్ లీడర్స్, కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పోరాటం వీరి మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో జగన్ లోకేష్ డిబేట్ కి కూర్చుంటే ఎలా ఉంటుంది.
ఇది ఊహ మాత్రమే కాదు ఒక మంత్రి గారి కోరిక కూడా. కూటమి మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే జగన్ లోకేష్ తో పది నిముషాల పాటు అయినా డిబేట్ లో కూర్చోగలరా అని సవాల్ చేసే ధోరణిలోనే ప్రశ్నించారు. అలా కూర్చుంటే జగన్ నాలెడ్జి ఏపాటితో తేలిపోతుందని మంత్రి గారు ఎద్దేవా చేస్తున్నారు.
అంటే లోకేష్ కి అన్ని విషయాల మీద అవగాహన లేదని జగన్ కి లేదని వాసంశెట్టి వైసీపీ నేత మీద ఘాటు విమర్శలు చేశారన్న మాట. వెన్నుపోటు అన్నది జగన్ కి వెన్నతో పెట్టిన విద్య అని కూడా మండిపడ్డారు.ఆయన తల్లికి చెల్లెలుకు వెన్నుపోటు పొడవడమే కాదు పార్టీలో చాలా మందికి పొడిచారని ఎస్సీ ఎస్టీ పథకాలు తీసేది బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారు అని అన్నారు. కల్తీ మద్యం అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘనత జగన్ దే అన్నారు.
తన అయిదేళ్ళ పాలనలో ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినది జగన్ కాదా అని దుయ్యబట్టారు. శవ రాజకీయాలకు డైవర్షన్ పాలిటిక్స్ కి జగన్ పెట్టింది పేరు అన్నారు. అలాంటి జగన్ ఈ రోజు వెన్నుపోటు దినం నిర్వహించడం అంటే విడ్డూరమే అన్నారు మొత్తానికి లోకేష్ తో డిబేట్ కి జగన్ ని పిలుస్తూ మంత్రి గారు పెద్ద సవాల్ నే విసిరారు. అలా జరుగుతుందా అంటే నో చాన్స్ అసలు జరిగేదే లేదు. ఎందుకంటే ఈ రోజుకీ లోకేష్ పేరుని జగన్ ప్రస్తావించడం లేదు, చంద్రబాబునే తన రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తున్నారు. సో అదన్న మాట మ్యాటర్.
