పొదిలి కాదు రెంటపాళ్ళ!
ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ నెల 11న జగన్ పర్యటన సాగింది. అది ఘర్షణాత్మకం అయింది, తొమ్మిది మంది మీద ఏకంగా కేసు పెట్టారు.
By: Tupaki Desk | 17 Jun 2025 10:51 PM ISTప్రకాశం జిల్లా పొదిలిలో ఈ నెల 11న జగన్ పర్యటన సాగింది. అది ఘర్షణాత్మకం అయింది, తొమ్మిది మంది మీద ఏకంగా కేసు పెట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి కి నోటీసులు ఇచ్చారు అని ప్రచారం సాగింది. ఇపుడు రెంటపాళ్ల తెర మీదకు వచ్చింది.
తమ పార్టీకి చెందిన సీనియర్ నేత ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. రెంటపాళ్ళలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా జగన్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం షెడ్యూల్ అయి వారం అయింది. పల్నాడు జిల్లా పోలీసులకు వైసీపీ నేతలు పర్యటన అనుమతి కోసం దరఖాస్తు చేశారు. మొదట ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారని ఇపుడు జనాలు ఎక్కువగా రావద్దు అని చెబుతున్నారు పర్యటన రద్దు కోసమే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.
దాంతో జగన్ పర్యటన విషయం మీద పల్నాడు జిల్లా మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆరు నూరు అయినా జగన్ రెంటపాళ్ళ వస్తున్నారు అని స్పష్టం చేశారు. జగన్ తో జనాలు రావద్దు అంటే ఎలా. ఎన్నో రకాలైన ఆంక్షలు విధిస్తున్నారని వారు మండిపడ్డారు. జగన్ అంటేనే జనమని వారు వస్తారని పేర్కొన్నారు.
జగన్ తో వేలాదిగా జనాలు వస్తున్నారని ప్రభుత్వానికి భయం పట్టుకుందని అన్నారు. అరాచక పాలన తీరు చూశాక జగన్ మీద మరింతగా జనాలకు నమ్మకం పెరిగింది అని వారు చెప్పారు జగన్ పర్యటనలను దురుద్దేశ్యంతో అడ్డుకోవాలని చూస్తున్నారు అని ఆరోపించారు. అయినా సరే జగన్ రావడం ఖాయమని పేర్కొన్నారు.
మరో వైపు జగన్ తో కొద్ది మంది మాత్రమే రావాలని పోలీసులు కోరినట్లుగా చెబుతున్నారు. అయితే వేలాదిగా జనాలతో వస్తే ఎక్కడైనా బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలని అంతే తప్ప అతి చిన్నగా ఇరుకుగా ఉన్న రెంటపాళ్ళ మీద జనాలు వచ్చిపడితే నియంత్రించలేమని పోలీసులు అంటున్నారు.
అయితే తమ వెంట జనాలు ఉంటారని జగన్ వచ్చి తీరుతారని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలా చూస్తే అటు పోలీసులు ఇటు వైసీపీ నేతలు తగ్గినట్లుగా కనిపించడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ రెంటపాళ్ళ టూర్ ఉందని వైసీపీ అధికారికంగా ఖాయం చేసింది.
జగన్ బుధవారం ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన తరువాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారని వెల్లడించాయి.
అటు పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఇటు వైసీపీ సైతం తాము తగ్గేది లేదని అంటోంది. తాము ఇపుడు కనుక వెనక్కి తగ్గితే ఇక మీదట జగన్ పర్యటనలకు ఇలాగే ఆంక్షలు పెట్టుకుంటూ పోతారని అంటోంది. దాంతో ఈ వ్యవహారంలో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. నిన్న పొదిలి నేడు రెంటపాళ్ళ అన్నదే ఇపుడు డిస్కషన్ గా మారింది. ఇందులో ప్రభుత్వానిదే తప్పు అని తమ పార్టీ అధినేత పర్యటనలలో పోలీసులును ముందు పెట్టి ఇబ్బందులు పెడుతోందని వైసీపీ అంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
