కరెక్ట్ టైంలో జగన్ ట్వీట్ ...మ్యాటర్ ఏంటి ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. రెండు సార్లు ఓటమి వైసీపీని వరించింది.
By: Tupaki Desk | 26 Dec 2025 8:08 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. రెండు సార్లు ఓటమి వైసీపీని వరించింది. ఒకసారి విజయం దక్కింది. ఇక 2029 ఎన్నికల మీద వైసీపీ ఫుల్ ఫోకస్ ఉంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో వైసీపీ ఉంది అని గడచిన కొంతకాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తునాయి. మరో వైపు చూస్తే ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారికి దగ్గర అయిన పార్టీదే విజయం అని అనేక ఎన్నికలు రుజువు చేశాయి. వంగవీటి రంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆరాధ్య నాయకుడు. నిజం చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రంగా ఎంతగానో పాటుపడ్డారు. ఆయన అంటే కులాలకు మతాలకు అతీతంగా అంతా గౌరవిస్తారు. అలాంటి నేపథ్యంలో వంగవీటి రంగా జయంతి వర్ధంతులను అంతా నిర్వహిస్తారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరవుతారు. ఇక రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూంటారు. ఇపుడు చూస్తే వైసీపీ అధినేత జగన్ రంగాకు నివాళి అర్పిస్తూ చేసిన ఒక ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.
పేదల గొంతుక అంటూ :
వైఎస్ జగన్ చేసిన ట్వీట్ లో రంగాను గొప్పగా కీర్తించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అని ఆయన చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇక రంగా 1988లో దారుణ హత్యకు గురి అయ్యారు. ఆయన అభిమానులు ఇపుడు అన్ని పార్టీలలో ఉన్నారు. ఆయన రాజకీయ వారసుడిగా జనం ముందుకు వచ్చిన కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నప్పుడు రంగా జయంతులు వర్ధంతులు పార్టీ తరఫున అధికారికంగానే నిర్వహించేవారు. అయితే రాధా వైసీఈని వీడిన తరువాత వైసీపీ అధికారంలో ఉన్నపుడు రంగా గురించిన కార్యక్రమాలు పెద్దగా అయితే లేవని అంటారు. ఆ పార్టీకి చెందిన వారు ఎవరికి వారుగానే రంగాను స్మరించుకున్నారు. ఇక అధినాయకత్వం స్థాయిలో రంగాకు నివాళి అర్పించడం అన్నది కూడా ఇటీవల కాలంలో జరగలేదు అని అంటున్నారు. అలాంటిది జగన్ రంగా వర్ధంతి వేళ ఆయనకి నివాళులు అర్పించడం అంటే ఇది రాజకీయంగా అతి పెద్ద చర్చకు తావిస్తోంది.
రంగానాడు వేళ :
విశాఖలో రంగానాడు పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. దానికి రంగా కుమార్తె ఆశాకిరణ్ హాజరవుతున్నారు. ఆమె గత కొంతకాలంగా ప్రజా జీవితంలోకి రావడానికి చూస్తున్నారు. ఆ మధ్యన గోదావరి జిల్లాలలో ఆమె పర్యటిస్తూ రంగా ఆశయాల సాధన కోసం పనిచేస్తాను అని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో తాను లేను అని కూడా చెప్పారు. అయితే ఆశాకిరణ్ ని వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఆమె సోదరుడు రాధా టీడీపీలో ఉన్నారు. దాంతో వైసీపీ ఒక ఆప్షన్ గా ఆమెకు ఉండొచ్చని అంచనా కడుతున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆశాకిరణ్ ఏమీ చెప్పడంలేదు, రాధా రంగా మిత్రమండలి సలహా సూచనల మేరకు తాను పనిచేస్తాను అని అంటున్నారు. అయితే రంగానాడు జరుగుతున్న వేళ రంగా వర్ధంతి సందర్భంగా జగన్ వేసిన ఈ ట్వీట్ తో ఏమీ రాజకీయాల్లో కొత్త సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. రంగానాడు తరువాత జరగబోయే పరిస్థితులు పరిణామాలు ఏ దిశగా సాగుతాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద జగన్ వేసిన ఈ ట్వీట్ మాత్రం రాజకీయ ఆసక్తిని పెంచడమే కాకుండా సర్వత్రా చర్చకు కూడా ఆస్కారం కల్పిస్తోంది అని అంటున్నారు.
