Begin typing your search above and press return to search.

అటు సాయన్న.. ఇటు షర్మిలమ్మ.. మధ్యలో జగనన్న!!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లక్ష్యంగా జరుగుతున్న రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Aug 2026 10:00 PM IST
అటు సాయన్న.. ఇటు షర్మిలమ్మ.. మధ్యలో జగనన్న!!
X

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లక్ష్యంగా జరుగుతున్న రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. ఒకప్పుడు జగన్ రెడ్డికి కుడి, ఎడమ భుజాల్లా పనిచేసిన ఇద్దరు ముఖ్యులు ఇప్పుడు ఆయనతో విభేదించడమే కాకుండా, తీవ్ర పదజాలంతో విమర్శలు ఎక్కుపెట్టడం హీట్ పుట్టిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే మాజీ సీఎం జగన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే అన్ని శక్తులు ఏకం అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన ప్రత్యర్థులు నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎలా అధిగమిస్తారనేదే పెద్ద సస్పెన్స్ గా మారిందని అంటున్నారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన కెరీర్ లో ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం అనుభవిస్తున్నారని అంటున్నారు. 2011లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ రెడ్డి 2024 వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా నిరూపించుకున్నారు. అయితే 2024 ఎన్నికల ముందు నుంచి తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేలా ప్రత్యర్థులు శరవేగంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.

జగన్ రెడ్డికి తోడునీడగా నిలిచిన సోదరి వైఎస్ షర్మిల 2024 ఎన్నికలకు ముందు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారడం ద్వారా పెద్ద సవాలు విసిరితే, ఇప్పుడు జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నేను సైతం అన్నట్లు కాలు దువ్వుతున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి తాజాగా కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ పేరు ప్రకటించకముందే జగన్ రెడ్డి టార్గెట్ గా ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయని, అందుకు జగన్ రెడ్డి కారణం అన్నట్లు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జగన్ రెడ్డిపై ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ ఈ తరహా చేయలేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా పనిచేస్తుండగా, విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో రాజకీయాల్లో సత్తా చాటుతానని అంటున్నారు. ఈ ఇద్దరు ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ రెడ్డినే టార్గెట్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. సొంత కుటుంబ వ్యవహారాలు, ఆస్తుల వివాదాలతోపాటు రాష్ట్ర రాజకీయాలల్లోనూ జగన్ రెడ్డి వైఫల్యాలపైనే షర్మిల ఎక్కువగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె మాటల దాడిని అడ్డుకోలేకపోతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు షర్మిలకు తోడుగా విజయసాయిరెడ్డి జత కలవడం ద్వారా వైసీపీని ఇరుకన పెట్టేలా ప్రత్యర్థులు వ్యూహరచన చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మాజీ సీఎం జగన్ రెడ్డికి ఇరువైపులా షర్మిల, విజయసాయిరెడ్డి మొహరించి, నేరుగా ఆయనపైనే యుద్ధం అన్నట్లు మాటల దాడి చేస్తుండటం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ఇద్దరు ఒకప్పుడు వైసీపీలో క్రియాశీలంగా పనిచేయడమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులుగా, అత్యంత సన్నిహితులుగా ప్రజలలో గుర్తింపు ఉండటం వల్ల వారి మాటలకు విలువ ఉంటోందని అంటున్నారు. జగన్ రెడ్డి ప్రత్యర్థులకు మేలు చేసేలా ఈ ఇద్దరు వేస్తున్న అడుగులను జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడ్డుకోవాల్సివుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో వైసీపీ రానున్న రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.