Begin typing your search above and press return to search.

జగన్ చిత్తూరు టూర్.. పోలీసులకు మరో సవాల్

ఇక గత నెలలో పల్నాడు జిల్లా పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతులకు కూడా పోలీసులే కారణమంటూ వైసీపీ ఆరోపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 July 2025 3:00 PM IST
జగన్ చిత్తూరు టూర్.. పోలీసులకు మరో సవాల్
X

ఏపీలో అధికార, విపక్షాల మధ్య ఎత్తులు పైఎత్తులతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అయితే రెండు పార్టీల పోరులో పోలీసులు నలిగిపోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటనలు పోలీసులకు పెను సవాల్ విసురుతున్నాయి. విపక్ష హోదా లేకపోయినా, మాజీ సీఎం హోదాలో జగన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. అయితే తాను సీఎంగా ఉండగా, ఎంత మంది సిబ్బందితో భద్రత కల్పించారో, ఇప్పుడు కూడా అంతేమంది పోలీసులను నియమించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తన మాస్ ఫాలోయింగు వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రస్తుతం ఉన్న పోలీసులు జనాన్ని నియంత్రించలేకపోతున్నారని జగన్ వాదిస్తున్నారు. అందువల్ల సెక్యూరిటీని పెంచాలని పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే నిబంధనల పేరుతో మాజీ సీఎం జగన్, వైసీపీ అభ్యర్థలను ప్రభుత్వం తిరస్కరిస్తోంది. కేంద్ర హోం శాఖ గైడ్ లైన్స్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరి కింద ఎంతమందితో భద్రత కల్పించాలో అంతేమందిని కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించి గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారని కొంతమందిని, మాజీ సీఎంకు ప్రాణ హాని లేదని మరికొందరిని తగ్గించిందని అంటున్నారు. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన భద్రతను నిర్లక్ష్యం చేస్తోందని మాజీ సీఎం తరుఫున ఆయన పార్టీ న్యాయపోరాటం చేస్తోంది.

ఇక గత నెలలో పల్నాడు జిల్లా పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతులకు కూడా పోలీసులే కారణమంటూ వైసీపీ ఆరోపిస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి జగన్ వెళ్తానంటే మూడు కార్లు వంద మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం, పోలీసుల సూచనలను బేఖాతరు చేస్తూ జగన్ భారీ ర్యాలీగా పర్యటనకు వెళ్లడంతో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్ వ్యూహానికి కౌంటర్ గా నెల్లూరు పర్యటనకు వైసీపీ దరఖాస్తు చేస్తే అనుమతిచ్చినట్లే ఇచ్చి ర్యాలీకి అవకాశం లేకుండా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. నెల్లూరు సెంట్రల్ జైలులో ములాఖత్ కోసం జగన్ పర్యటించాల్సివుండగా, సెంట్రల్ జైలుకు పది కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్ ఏర్పాటుకు వైసీపీ దరఖాస్తు చేసింది. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదిపి సెంట్రల్ జైలు పక్కనే హెలిపాడ్ కు అనుమతిచ్చారు. దీంతో ర్యాలీకి అవకాశం లేకపోవడంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఇక ప్రభుత్వ వ్యూహానికి ప్రతివ్యూహంగా జగన్ ఎత్తుగడ వేశారు. తన పర్యటనకు ప్రభుత్వం తప్పనిసరిగా అంగీకరించేలా దరఖాస్తు చేయించారు. చిత్తూరులోని తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండు చేస్తూ 9వ తేదీన పర్యటనకు దరఖాస్తు చేశారు. ఆ రోజు చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మార్కెట్ కమిటీకి మాజీ సీఎం వస్తున్నారని, దాదాపు 10 వేల మంది రైతులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున అవసరమైన అనుమతితోపాటు భద్రత చర్యలు తీసుకోవాలని వైసీపీ పోలీసులను కోరింది.

దీంతో ప్రభుత్వం కోర్టులో బంతి వేసినట్లైంది. నెల్లూరు పర్యటనను వ్యూహాత్మకంగా అడ్డుకున్న టీడీపీ ప్రభుత్వం.. జగన్ చిత్తూరు టూర్ కు ఎలా చెక్ పెడుతుందా? అనే చర్చ ఆసక్తి రేపుతోంది. జగన్ చిత్తూరు టూరుపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. కానీ, 10 వేల మందితో సభకు అనుమతి ఇవ్వాలనే వినతిని అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు. అయితే వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగానే పోలీసులను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా దరఖాస్తు చేసిందని చెబుతున్నారు. అయితే హెలిపాడ్ ఎక్కడ పెట్టేది తేలకపోవడంతో జగన్ టూరుపై ఇంకా పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. మొత్తానికి వైసీపీ వ్యూహాత్మకంగానే పోలీసులను సవాల్ చేసేలా వ్యవహరిస్తోందని అంటున్నారు.