జగన్ కి జనాలు...వైసీపీకి ప్లస్సేనా ?
జగన్ తాజాగా తెనాలిలో పర్యటించారు. పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులను రోడ్డు మీద లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంతో వారిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటన చేశారు.
By: Tupaki Desk | 4 Jun 2025 4:00 PM ISTజగన్ తాజాగా తెనాలిలో పర్యటించారు. పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులను రోడ్డు మీద లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంతో వారిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా జగన్ ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతో జగన్ కి జనాదరణ బాగానే ఉందన్న చర్చ మొదలైంది.
అయితే పెద్ద ప్రశ్న ఏమిటి అంటే జగన్ కి జనాలు ఎపుడు రావడం లేదు అన్నదే. జగన్ జనంలోకి ఎపుడు వెళ్ళినా ప్రజలు అలాగే వస్తున్నారు. అంతవరకూ ఎందుకు సిద్ధం సభలను గత ఎన్నికల ముందు జగన్ పెడితే జన సముద్రమే అక్కడ కనిపించింది. అయితే ఫలితాలు మాత్రం రివర్స్ లో వచ్చాయి.
ఇక ఏ నాయకుడికి అయినా జనాదరణ ఉండడం మంచి విషయమే. అయితే విజయానికి అది ఒక్కటే కొలమానం కాదు. వచ్చిన జనాలను పార్టీ వైపుగా తిప్పుకుని ఓట్లు వేయించుకునే పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండాలి. వైసీపీకి 2024 ఎన్నికల్లో క్యాడర్ ప్లస్ లీడర్ పెద్దగా సహకరించకపోవడం వల్లనే మరీ బొత్తిగా 11 సీట్లకే పరిమితం అయింది అని అంటున్నారు.
అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం తరచూ ఒక మాట అంటూ ఉంటుంది. పైన దేవుడు ఆ తరువాత ప్రజలు ఉన్నంతవరకూ వైసీపీకి ఢోకా లేదని. కానీ జనాలు దేవుడు దీవించినా పూజలు చేయడం ప్రసాదాలు చేసి పంచడం అన్నది భక్తులే చేయాలి. ఆ భక్తుల లాంటి వారే పార్టీ కార్యకర్తలు. వైసీపీ ఓటమి తరువాత పెద్దగా చురుకుగా లేదు.
చాలా చోట్ల ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయిన నాయకుల స్థానంలో కొత్త వారిని తీసుకోలేదు. మరి కొన్ని చోట్ల తీసుకున్నా అంత బలంగా లేరు. ఇక పార్టీలో అంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దాంతో పార్టీని గాడిన పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.
అయితే వైసీపీ అధినాయకత్వానికి చుట్టూ కోటరీ ఉందని దాని వల్లనే ఇబ్బందులు అని పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందులో చాలా నిజం ఉందని పార్టీకి భారీ రిపేర్లు అవసరం అని వైసీపీలో చర్చ సాగుతోంది.
ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ కి జనాలు బాగా వస్తున్నారు అంటే పార్టీ గురించి మళ్ళీ పెద్దగా ఆలోచించే పరిస్థితి ఉండదేమో అన్న బెంగ అయితే నేతలలో ఉంది. జనాలను చూసుకుని మురిసిపోవడం వ ల్లనే 2024 ఎన్నికల్లో భారీ ఓటమి వైసీపీ సొంతం అయిందని గుర్తు చేస్తున్నారు.
జనాలు వస్తారు, వారి ఆదరణ బాగానే ఉన్నా దానికి ఒక పక్కన పెట్టి పార్టీని పునర్ నిర్మించుకుంటేనే 2029 ఎన్నికల్లో వైసీపీకి విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. అలా కాకుండా నాయకులతో క్యాడర్ తో ఏమి పని అన్నట్లుగా తీరు ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వైసీపీని పూర్తిగా వ్యవస్థీకరించడానికి ఇదే తగిన సమయం అంటున్నారు. తన వారు ఎవరో పర వారు ఎవరో తెలుసుకుని నిబద్ధత సమర్ధత విధేయత ప్రామాణికంగా చూసుకుని పార్టీ పదవులలో నియామకాలు చేయాలని కోరుతున్నారు.
జనాలు వచ్చారు జేజేలు పలికారు ఇంకేముంది అధికారం మనదే అనుకుంటే మాత్రం అవతల ఉన్నది బలమైన కూటమి ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు చాణక్యం పవన్ కళ్యాణ్ గ్లామర్ ప్లస్ వెన్ను దన్నుగా ఉన్న సామాజిక వర్గం, కేంద్రంలో నరేంద్ర మోడీ సహకారం ప్లస్ ఇమేజ్ ఇలా వీటి ముందు తట్టుకొని నిలబడాలీ అంటే కనుక ఓడిన తరువాత రెండో ఏడాది నుంచి అయినా కంప్లీట్ యాక్షన్ ప్లాన్ లోకి దిగాల్సిందే అని వైసీపీ అధినాయకత్వానికి విలువైన సూచనలు వస్తున్నాయి.
