Begin typing your search above and press return to search.

బిల్లును అడ్డుకొని పార్టీలు సాధించిందేంటి? పోస్టుతో జగన్ సూటిప్రశ్న

కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగేది. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయి.

By:  Garuda Media   |   18 April 2026 9:57 AM IST
బిల్లును అడ్డుకొని పార్టీలు సాధించిందేంటి? పోస్టుతో జగన్ సూటిప్రశ్న
X

లోక్ సభలో ప్రవేశ పెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. బిల్లు వీగిపోవటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందన్న ఆయన.. బిల్లు వీగిపోవటం సరికాదన్న విషయాన్ని సోషల్ మీడియా (ఎక్స్)లో పోస్టు చేసిన సుదీర్ఘ పోస్టులో అభిప్రాయపడిన వైనం ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ బిల్లు.. మహిళా రిజర్వేషన్ బిల్లులపై తన ఆలోచన ఏమిటన్న విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పేశారు. అయితే.. ఈ వాదనను డీలిమిటేషన్ బిల్లు ప్రవేశ పెట్టటానికి ముందే కానీ చెప్పి ఉంటే మరోలా ఉండేదంటున్నారు.

అందుకు భిన్నంగా బిల్లు వీగిపోయిన తర్వాత వెల్లడించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన వైనంపై ఆయన ఏమన్నారు? ఎలా స్పందించారన్న విషయాన్ని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో వివరంగా వెల్లడించటం ద్వారా.. తాను మోడీ సర్కారు చేపట్టిన డీలిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉన్నట్లుగా చెప్పేశారని చెప్పాలి. ఇంతకూ జగన్ తన పోస్టులో ఏయే అంశాల్ని ప్రస్తావించారన్నది చూస్తే.. మరింత స్పష్టత వస్తుందని చెప్పాలి.

డీలిమిటేషన్ ద్వారా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే.. దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరిగేవని.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది ఉండేదని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ఈ బిల్లును లోక్ సభలో అడ్డుకోవటం ద్వారా పార్టీలు తామేం సాధించాయో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచన చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలోని మహిళలకు.. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం దక్కలేదన్న ఆవేదనను వ్యక్తం చేసిన జగన్.. తాజా పరిణామంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందన్న ఆందోళనను వ్యక్తం చేయటం గమనార్హం.

కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగేది. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఒకవేళ 2026 జనాభా లెక్కలు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుంది. కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుచేసినందుకు జనాభా పెరుగుదలను తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింత నష్టపోతాయన్నారు. 50 శాతం సీట్ల పెంపుదల విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లు కాస్తా 38 సీట్లకు పెరుగుతాయని.. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్ల సంఖ్య 34 మాత్రమే అవుతాయన్నారు. అంటే.. 2011 జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకున్నా నాలుగు ఎంపీ సీట్లు కోల్పోవటం ఖాయమన్నారు.

ఏపీ ఉదాహరణను ప్రస్తావించిన జగన్.. తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని చెప్పారు. మోడీ సర్కారు తెర మీదకు తీసుకొచ్చిన 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీస్థానాలు కాస్తా 26 సీట్లకు పెరుగుతాయని.. అదే 2011 జనాభా లెక్కను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 24 మాత్రమే అవుతాయని.. ఆ లెక్కన చూస్తే.. రెండు సీట్లు నష్టపోవాల్సి ఉంటుందన్నారు.

ఇదే లెక్కను కర్ణాటక రాష్ట్రానికి వేసిన జగన్.. ఆ రాష్ట్రం 2011 జానాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని..అలానే లాభంకూడా ఉండదని స్పష్టం చేశారు. మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళ మాత్రం ఏకంగా 7 ఎంపీ సీట్లను నష్టపోతుందన్నారు. తమిళనాడు విషయానికి వస్తే.. దాదాపు 9 ఎంపీ స్థానాల్ని నష్టపోతుందని జగన్ పేర్కొన్నారు. మొత్తంగా 50 శాతం సీట్ల పెంపు విధానం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని తన లెక్కలతో జగన్ స్పష్టంగా చెప్పేశారు.

2011 జనాభా లెక్కను పరిగణలోకి తీసుకుంటే ఇంత నష్టపోయే దక్షిణాది రాష్ట్రాలు.. అదే 2026 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలు మరింత భారీగా ఎంపీ సీట్లను కోల్పోవటం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించటమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమన్నారు.

ప్రస్తుతం దేశంలో 543 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 సీట్లు ఉన్నాయని.. అంటే.. దేశంలోని ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా 23.76 శాతంగా ఉందని.. కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు విధానం అమలైతే.. దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగే ఎంపీ స్థానాలు 195కు పెరుగుతాయని.. అంటే.. దేశం మొత్తమ్మీదా 815 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.87 శాతానికి పెరుగుతుందన్నారు. అందుకు భిన్నంగా 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే దక్షినాది రాష్ట్రాల వాటా 20.44 శాతానికి పరిమితం అవుతుందని.. దక్షిణాది రాష్ట్రాలు 21 ఎంపీ సీట్లను నష్టపోతాయన్నారు. అదే.. 2026 జనాభా లెక్కల్ని అమల్లోకి తెస్తే దక్షిణాది రాష్ట్రాలు భారీగా ఎంపీ సీట్లను నష్టపోతుందన్నారు. అందుకు జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా కేంద్రం చెబుతున్న యాభై శాతం సీట్ల పెంపును ఓకే చేయటమే దక్షిణాది రాష్ట్రాలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.