వైసీపీ గ్రాఫ్ పెరిగిందా...లేదా ?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి.
By: Satya P | 2 May 2026 8:00 PM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా క్షేత్ర స్థాయి వరకు విస్తరించి ఉన్న పార్టీ. ఆ పార్టీ చరిత్ర నాలుగు దశాబ్దాలు. ఇకపోతే జనసేన పార్టీకి సినీ గ్లామర్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ అధినేత. ఒక బలమైన సామాజిక వర్గం మద్దతు కూడా ఉన్నది. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ వంటి ఆకర్షణీయమైన నాయకత్వం బిజెపికి శ్రీరామరక్షగా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండడం కూడా మరో సానుకూల పరిణామం.
వైసీపీ విపక్షంలో :
ఇక ప్రతిపక్షం వైపు చూస్తే వైసిపి ఉంది. ఆ పార్టీ మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకసారి మాత్రమే గెలిచింది. వైసీపీకి సర్వసత్తాక నాయకుడు వైఎస్ జగన్. 2019కి ముందు జగన్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని అంటింది. దానికి కారణం తీసుకుంటే వైయస్సార్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుని కుమారుడిగా జగన్ ఆకర్హ్సించారు. అదే విధంగా జగన్ కూడా దూకుడు తో కూడిన రాజకీయం అప్పట్లో చేస్తూ వచ్చారు. ఇవన్నీ కలసి వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని భావించి అన్ని వర్గాలు 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టాయి. అయితే 2024లో వైసీపీ ఓటమి చెందాక గత రెండేళ్ళలో వైసీపీలో పెద్దగా ఉత్సాహం అయితే ప్రోత్సాహం కనిపించట్లేదు అని అంటున్నారు. ఆ పార్టీ అధినాయకుడు కూడా తరచూ జనాల్లోకి రావట్లేదు, ఈ నేపథ్యంలో చూస్తుండగానే కాలం గడిచిపోతోంది.
కీలక ఘట్టం లో :
ఇక అధికార కూటమి కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. అంటే ప్రభుత్వం పట్ల ప్రజలకి అమ్మ నెమ్మదిగా అసంతృప్తి బాహటం అయ్యేందుకు అవకాశం ఉన్న వాతావరణ అన్న మాట. వివిధ వర్గాలలో అది బయటపడే సమయానికి అందుబాటులో ఉన్న ప్రతిపక్షం దాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా బలోపేతం అవుతుంది. ఇది ఎక్కడైనా జరిగే సహజ రాజకీయ ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అటువంటి పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రధాన ప్రత్యక్షంగా ఉంది, 40 శాతం ఓటు బ్యాంకు కూడా పార్టీకి ఉంది. కేవలం 11 సీట్లు అని ఆ పార్టీని కొట్టి పారేయడానికి లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక ఇమేజ్ ఉన్న అధినేతగా జగన్ వైసీపీకి నాయకత్వం వహిస్తున్నార. ఇంకా చెప్పాలంటే ఒక బలమైన సామాజిక వర్గం అండ కూడా ఆ పార్టీకి ఆంగ బలం అర్ద బలం కూడా ఉన్నాయి.
నాడు వందలు వేలుగా :
ఇక ఇన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నా కూడా వైసీపీ జనంలోకి ఊహించినంతగా వెళ్ళలేకపోతోంది. పార్టీ నాయకులు కూడా మీడియాకే పరిమితం అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వందలూ వేలుగా కనిపించిన నాయకులు ఇప్పుడు ఐదు పదిగా మాతమే కనిపిస్తున్నారు. అది కూడా మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక అధినేత కూడా జనంలోకి వెళ్ళడం పాదయాత్రతోనే అన్నట్టుగా ఆలోచిస్తున్నారని ప్రచారంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రెండేళ్ల కూటమి పాలన పూర్తి చేసుకున్న సమయంలో సహజంగా ఏర్పడే ప్రజా వ్యతిరేకత అలాగే ఎంతో కొంత అసంతృప్తి ప్రతిపక్షానికి కలసి రావాలి. అదే విధంగా వైసీపీ గ్రాఫ్ ఈసరికే ఎంతో కొంత పెరిగి ఉండాలి. అంటే ఆ పార్టీకి 2024 లో వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకుకి కనీసం రెండు మూడు శాతం అదనంగా పెరిగి ఉండాల్సింది.
అంతర్మధనంతోనే :
కానీ పరిస్థితి చూస్తే ఆ విధంగా కనిపించట్లేదు అని ఫ్యాన్ పార్టీలోనే చర్చ సాగుతోంది. కూటమి పట్ల వ్యతిరేకత ఉందని వైసీపీ నేతలు అంటున్నా అది తమ పార్టీ వైపుగా సానుకూలంగా మారకపోవడమేంటి అని వైసీపీలో తర్జనభర్జన పడుతున్నారని టాక్. వైసీపీ ఈ విషయంలో ఏం చేసింది ఏం చేయాలి అన్నదానిమీద కూడా పార్టీ సీనియర్లు కొంతమంది మదనపడుతున్నారని అంటున్నారు. అధినేత చూస్తే ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశం అన్నది లేదు. దాంతో కూటమి పట్ల ఏమాత్రం అయినా ఏర్పడిన వ్యతిరేకత సానుకూలంగా మార్చుకోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కావట్లేదు అని అంటున్నారు. రెండేళ్ల పరిపాలన తర్వాత కూడా కూటమి ఇంకా అదే దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. ఎన్నికల ముందు వైసీపీని ఏ విధంగా చీల్చి చెండాడుతూ విమర్శలు చేసిందో అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తోని. దానికి ధీటైన కౌంటర్లు వైసీపీ నుంచి రావడం లేదని అంటున్నారు.
అవి జనంలోకి :
దాంతో గొడ్డలి పార్టీ అని జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కూటమి పెద్దలు చేస్తున్న విమర్శలు జనంలోకి మెల్లగా వెళుతున్నాయా అన్న ఆందోళన కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసే విధంగా వైసీపీ తగినంత సరంజామాతో ముందుకు రాలేకపోతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే పుణ్య కాలం గడుస్తోందా అన్నది ఒక ప్రశ్న. అధినాయకత్వం విషయం చూస్తే పాదయాత్రతోనే అన్ని మారిపోతాయన్నట్లుగానే ఉంది. దీంతో వైసీపీ గ్రాఫ్ పెరగకపోతే కనుక రానున్న కాలంలో ఇబ్బందులు వస్తాయని కూడా సీనియర్ల అంతర్మధనం చెందుతున్నట్లుగా తెలుస్తోంది.
