ఆడేది.. ఆడించేది: వైసీపీ నిర్వీర్యం ..!
రాజకీయాలో ఆట మామూలుగా ఉండదు. బలమైన వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. రాజకీయాలను అంతే బలంగా శాసిస్తుంటాయి.
By: Tupaki Desk | 24 May 2025 8:15 AM ISTరాజకీయాలో ఆట మామూలుగా ఉండదు. బలమైన వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. రాజకీయాలను అంతే బలంగా శాసిస్తుంటాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. ఆడేది అధికార పార్టీ .. ఆడించేది ప్రతిపక్ష పార్టీగా మారిపోతున్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో వీటికి అనుసంధానంగా ఉన్న వైసీపీ నిర్వీర్యం అవుతుండడం మరో చిత్రమైన రాజకీయంగా మారింది. ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన హామీలపై జగన్ ఫోకస్ పెంచారు.
కూటమి సర్కారు ప్రకటించిన సూపర్ సిక్స్‌ను అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన పరోక్షంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచనున్నట్టు కూడా చెప్పారు. ఇది ఒకరకంగా.. ఆడించడం! అంటే..తాము అధికారంలో లేకపోయినా.. సర్కారును మాత్రం తమ చెప్పు చేతల్లో పెట్టుకునే కీలక వ్యూహం. ఈ దిశగానే జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు.. ఆయనకు ఎంత వరకు మేలు చేస్తాయన్నది పక్కన పెడితే.. పార్టీని మాత్రం నిర్వీర్యం చేస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు వైసీపీ నాయకులు కోరుకుంటున్నది.. పార్టీని బలోపేతం చేయడం. పైగా.. ఏడాది కూడా కాకుండానే.. కూటమి సర్కారుపై విరుచుకుపడడం సరికాదన్న చర్చ కూడా పార్టీలో ఉంది. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని వంటివారుకూడా.. అంతర్గత సంభాషణల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి భాషలో చెప్పాలంటే..''ఈ ప్రభుత్వం పాపం పండేందుకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు మేం వేచి చూస్తాం'' అని అంటున్నారు.
కానీ, ఇప్పటికిప్పుడు పార్టీని బలోపేతం చేయాలని మాత్రం వారు కోరుకుంటున్నారు. ఈ పరిణామాలు.. పార్టీలోనే చర్చకు వస్తున్నాయి. సో.. వీటిపైనే పార్టీ అధినేతగా జగన్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాదని... తన స్ట్రాటజీని అమలు చేస్తే.. మొత్తానికే మోసం వస్తుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే ముందుకు కదలాలన్న సూచనలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నారు. సో.. ఇప్పుడు తాము ఆడిస్తాం.. ప్రభుత్వం ఆడుతుంది.. అంటూ.. జగన్ వ్యవహరిస్తే.. అది పార్టీ నిర్వీర్యానికి దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
