Begin typing your search above and press return to search.

మా పార్టీలోని కమ్మవారిని వేధిస్తున్నారు.. రెంటపాళ్లలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు!

సత్తెనపల్లి నియోజకవర్గం రెండపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఆ గ్రామ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు బుధవారం జగన్ ఆ గ్రామానికి వెళ్లారు

By:  Tupaki Desk   |   18 Jun 2025 6:12 PM IST
మా పార్టీలోని కమ్మవారిని వేధిస్తున్నారు.. రెంటపాళ్లలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు!
X

తీవ్ర ఉద్రిక్తల మధ్య మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన ముగిసింది. సత్తెనపల్లి నియోజకవర్గం రెండపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఆ గ్రామ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు బుధవారం జగన్ ఆ గ్రామానికి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ఆయన రెంటపాళ్ల వెళ్లాల్సివుండగా, తాడేపల్లిలో ఆయన బయలు దేరిన నుంచి రెంటపాళ్ల చేరేవరకు అభిమానులు అడుగడుగునా అడ్డుపడటంతో దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా జగన్ రెంటపాళ్ల వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో రెంటపాళ్ల వెళ్లిన జగన్ అక్కడ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో ఉన్న కమ్మ నాయకులను టార్గెట్ చేస్తూ హింసిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమ్మ కులస్తులు అంతా టీడీపీలోనే ఉండాలా? అంటూ జగన్ ప్రశ్నించారు. తన పార్టీలో ఉన్న కమ్మ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏం పాపం చేశారని రెండు నెలలుగా జైలులో పెట్టారని, ఒక కేసులో బెయిలు వచ్చినా మరో కేసు పెడుతూ బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న కమ్మ కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరిపై 9 కేసులు పెట్టారని, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుల శివకుమార్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణను వేధిస్తున్నారని ఆరోపించారు.

రెంటపాళ్లకు చెందిన నాగ మల్లేశ్వరరావు కూడా కమ్మ కులానికే చెందిన వాడు అని, గత ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఆయనను వేధింపులకు గురిచేశారని, అప్పటి సీఐ రాజేశ్ వేధించడంతో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన తమ పార్టీ కార్యకర్త, కమ్మ సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణను పోలీసులు వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆయన సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారని జగన్ చెప్పారు. డీఎస్పీ ఓ కుల ఉన్మాదని, లక్ష్మీనారాయణ కమ్మవాడిగా పుట్టి వైసీపీలో ఉన్నాడని ఆయన ప్రశ్నించాడని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గం వారు వైసీపీలో ఉండకూడదా? అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు జగన్ చెప్పారు. కమ్మ వారంతా చంద్రబాబుకు ఊడిగం చేయాలా? అంటూ నిలదీశారు. ఏం పాపం చేశారని తమ పార్టీలో ఉన్న కమ్మ నేతలను హింసిస్తున్నారని ఒక్కొక్కరి గురించి జగన్ చెప్పుకొచ్చారు. దేవినేని అవినాశ్ దగ్గర నుంచి మొత్తం వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నట్లు జగన్ ఆరోపించారు.