మీరు ఏ పుస్తకంలో అయినా రాసుకోండి.. వారికి సినిమా చూపిస్తా.. జగన్ మాస్ వార్నింగ్
వైసీపీ కార్యకర్తలు, నాయకులే టార్గెట్ గా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తూ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు
By: Tupaki Desk | 20 May 2025 5:46 PM ISTకూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులే టార్గెట్ గా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తూ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ‘‘కొడతానంటే కొట్టమనండి. మీరు ఏ పుస్తకంలోనైనా సరే వారి పేర్లు రాసుకోండి. ఆ అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. రిటైర్ అయినా లాక్కొస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా తిరిగి రప్పిస్తాం’’ అంటూ హెచ్చరించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు.
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్, పార్వతీపురం, రామచంద్రాపురం మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోపాటు రామగిరి మండలానికి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్ లతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించిన జగన్ కూటమి ప్రభుత్వం అక్రమంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ హయాంలో ఇలాంటి రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలను మనం క్లీన్ స్వీప్ చేశాం, తాడిపత్రిలో టీడీపీ గెలిచింది. ఆ పార్టీ కౌన్సిలర్లను మనం లాగేద్దామని అప్పటి ఎమ్మెల్యే అడిగితే తాను ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి టీడీపీ గెలిచే వాతావరణం కల్పించినట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపాలిటీల్లో గెలవాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
తిరువూరు నగర పంచాయతీలో టీడీపీకి బలం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. సంఖ్యాబలం లేకుండా పోటీకి పెట్టి లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వైసీపీవాళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. నరసారావుపేట, కారంపూడి, కుప్పం మున్సిపాలిటీల్లో ఇదే విధంగా బలవంతంగా మున్సిపాలిటీ చైర్మన్ పదవులను లాక్కున్నారని ఆరోపించారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్లను వేరే పార్టీలోకి తీసుకోవడం, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేకత రావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ, చంద్రబాబు పాలనపై నెలల వ్యవధిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పారు. మన కన్న ఎక్కువ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు కానీ వాటన్నింటినీ తుంగలో తొక్కాడని ధ్వజమెత్తారు. 99 శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలో వైసీపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. మనం చేసిన మంచి ఎక్కడికీ పోదని నేతలకు ధైర్యం చెప్పిన మాజీ సీఎం జగన్.. పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వారు ఎక్కడున్నా అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తానంటూ మాస్ వార్నింగిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రశ్నిస్తున్నవారిని అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు.
