సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ - పవన్ పై జగన్ వ్యంగ్యాస్త్రాలు!
విజయవాడకు చెందిన సాయికృష్ణ కేసు మిస్టరీపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు.
By: Tupaki Political Desk | 1 July 2026 10:25 PM ISTవిజయవాడకు చెందిన సాయికృష్ణ కేసు మిస్టరీపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసును డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ సైడ్ క్యారెక్టర్ పాత్ర పోషిస్తున్నారని, తానా తందాన అంటూ నాటకాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వెండితెరపై హీరోగా, మెయిన్ లీడ్ రోల్స్‌లో అలరించే పవన్ కళ్యాణ్, ప్రస్తుత రాజకీయాల్లో మాత్రం ఒక 'సైడ్ క్యారెక్టర్'గా మారిపోయారని జగన్ ఎద్దేవా చేయడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు ఆడే రాజకీయ నాటకంలో ఆయనకు వంత పాడుతూ, తందానా అంటున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన చేస్తున్న రాజకీయ డ్రామాను జగన్ తీవ్రంగా విమర్శించారు. ఒక కీలక పదవిలో ఉండి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పవన్, ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ప్రవర్తిస్తున్నారంటూ జగన్ చేసిన విమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి.
సాయికృష్ణ మృతి ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ జగన్ పలు ప్రశ్నలు సంధించారు. మొదట సాయికృష్ణను రౌడీ షీటర్‌గా ముద్రవేసి, ఆయన కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం, ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తగానే యూటర్న్ తీసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత అదే సాయికృష్ణ కుటుంబాన్ని సెక్రటేరియట్‌కు పిలిపించి, వారి పక్కన కూర్చొని సానుభూతి నటిస్తూ ప్రభుత్వం చేస్తున్న హడావుడి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటని జగన్ నిలదీశారు. ప్రాణం తీసే వరకు వెళ్ళిన ఈ ఉదంతంలో, కనీసం మృతదేహాన్ని కూడా చూపించని స్థితిలో, ఇలాంటి రాజకీయ సెట్టింగ్‌లు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో చట్టం, న్యాయం నిర్వీర్యమయ్యాయని జగన్ ఆరోపించారు. కోర్టులతో సంబంధం లేకుండా, తమ చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థను వాడుకుంటూ, ఎవరిపై కావాలంటే వారిపై దొంగ కేసులు పెట్టడం, వేధించడం, చివరికి ప్రాణాలు తీయడం కూడా ఒక అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. "చంపుతాం.. బూడిద కూడా ఇవ్వం" అనే స్థాయికి వెళ్లారని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధికారికంగా ప్రకటిస్తారా అని జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను, రాజకీయ దృష్టి మళ్లింపులను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు.
