పోలవరంతో రాజీ.. బనకచర్ల పేచీ ఏమిటిది ?
ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే పోలవరం వద్ద దిగువకు గూడవల్లి వద్ద గోదావరి మిగులు జలాలు దక్కకుండా చేస్తుందని అన్నారు.
By: Tupaki Desk | 17 July 2025 9:45 AM ISTఏపీలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పాలని చూస్తోంది ఈ విషయంలో తెలంగాణా అభ్యంతరాలను సైతం తోసిపుచ్చాలని వారితో సర్దుబాటు చేసుకుని అయినా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని చూస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన రేవంత్ రెడ్డి చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయిన రోజునే ఏపీ నుంచి మాజీ సీఎం జగన్ బనకచర్ల ప్రాజెక్ట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
మిగులు జలాలే గోదావరి బేసిన్ లో లేని పరిస్థితులు ఉంటాయని ఈ నేపధ్యంలో 81 వేల కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టాలనుకోవడం వృధా అన్నారు గోదావరికి అతి పెద్ద ఉప నదిగా ప్రాణహిత ఉందని, ప్రాణహిత వల్లనే గోదావరికి ఏటేటా వరదలు వస్తాయని జగన్ గుర్తు చేశారు. అయితే ప్రాణహితతో పాటు ఇంద్రావతి ప్రాజెక్ట్ ని కలుపుకుని ఒక జాతీయ ప్రాజెక్ట్ గా చేపట్టడానికి చత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి కేంద్రం యాభై వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని జగన్ అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే పోలవరం వద్ద దిగువకు గూడవల్లి వద్ద గోదావరి మిగులు జలాలు దక్కకుండా చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో పోలవరం దారి మళ్ళింపు కోసం ఎవైనా మిగులు జలాలు అందుబాటులో ఉంటాయా అన్నది ఆందోళన కలిగించే విషయంగా జగన్ చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో మిగులు జలాలు లేకుండా వరద జలాలు రాకుండా వాటిని నమ్ముకుని కొత్త ప్రాజెక్టులు చేపడితే ఉపయోగం ఏముందని జగన్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ పడ్డారని జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ మొదట అనుకున్న దాని ప్రకారం చూస్తే 45.72 మీటర్లు అయితే దానిని 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించేసారని ఆ విధంగా ఎత్తు విషయంలో బాబు రాజీపడ్డారని విమర్శలు చేశారు
దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్ లో తగినన్ని నీళ్ళు నిలువ చేయలేరని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో పోలవరం నుంచి నీటిని ఇతర ప్రాంతాలకు మళ్ళించడం ఎలా సాధ్యమో చెప్పాలని ఆయన చంద్రబాబుని డిమాండ్ చేశారు.
పోలవరం ప్యాకేజికి పునరావాసానికి 15 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని వాటిని నిధుల రూపంలో ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించకుండా ఉంటే ఏపీ ప్రభుత్వం ఆ మేరకు నిధులు సమకూర్చుకోవాలని జగన్ సూచించారు. అపుడే ఎత్తు తగ్గించకుండా పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతామని ఆయన అన్నారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్థ్యం ఏమిటో తెలుసుకోకుండా బనకచర్ల ప్రాజెక్ట్ అని తొందరపడడం వల్ల ఆర్ధికంగా నష్టం తప్ప మరేమీ ఉండదని జగన్ అంటున్నారు.
కేవలం వరద జలాల కోసం ప్రాజెక్ట్ అంటున్నారని ఆ నీరే భవిష్యత్తులో లేదు రాదు అని పరిణామాలు సూచిస్తున్న నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆలోచించాలని ఆయన కోరారు. మొత్తానికి జగన్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో కీలక వ్యాఖ్యలే చేశారు.
