Begin typing your search above and press return to search.

'ఆందోళనకరంగా ఏపీ పరిస్థితి'... కాగ్ లెక్కలతో జగన్ సంచలన వ్యాఖ్యలు!

కూటమి ప్రభుత్వం చెబుతున్నదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు ఉన్నాయని, వాస్తవాలు వెల్లడిస్తున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

By:  Tupaki Desk   |   7 Jun 2025 3:46 PM IST
ఆందోళనకరంగా ఏపీ పరిస్థితి... కాగ్ లెక్కలతో జగన్ సంచలన వ్యాఖ్యలు!
X

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని.. కాగ్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. కూటమి ప్రభుత్వం చెబుతున్నదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు ఉన్నాయని, వాస్తవాలు వెల్లడిస్తున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

అవును... తాజాగా కాగ్ నివేదికలను బయటపెట్టారు జగన్. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని.. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. ఇందులో భాగంగా... గత ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.

అయితే.. ఇది అసత్యమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందని చెప్పిన జగన్... 2024 ఏప్రిల్ తో పోలిస్తే 2025 ఏప్రిల్ లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20% తగ్గిందని తెలిపారు. ఈ వాస్తవ విషయాలను కాగ్ బయటపెట్టగానే.. ప్రభుత్వ కుట్రపూరితంగా వ్యవహరించిందని, ఏప్రిల్ విషయాలు దాచిపెట్టి మే లో జీఎస్టీ ఆదాయలు పెరుగుతాయని ప్రకటనలు చేస్తుందని వెల్లడించారు.

ఇదే సమయంలో... సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందని, అందువల్ల జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రభుత్వం ప్రకటించిందని.. వాస్తవానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీని లెక్కగడతారని తెలిపారు. అయితే... జీఎస్టీ ఆదాయాలపై కాగ్ నిజాలు వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తుందని మండిపడ్డారు.

కాగ్ విడుదల చేసిన గణాంకాలు ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి నెలలోనే ఆర్థిక మందగమనం యొక్క పరిస్థితిని స్పష్టంగా కనిపిస్తున్నట్లు సూచిస్తున్నాయని చెప్పిన జగన్... టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి, కాగ్ చెప్పే వాస్తవ నివేదికలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలూ తగ్గాయని తెలిపారు.

ఇందులో భాగంగా... గతేడాదితో పోలిస్తే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయని.. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయని.. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశమని జగన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ పోస్టులో కాగ్ నివేదికలను పొందుపరిచారు!