Begin typing your search above and press return to search.

వ‌రుస ప‌రాజ‌యాలు.. అయినా మౌనం వీడ‌ని జ‌గ‌న్‌...!

వ‌రుస పరాజ‌యాలు ఎదుర‌వుతున్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం త‌న మౌనాన్ని వీడడం లేదు.

By:  Tupaki Desk   |   16 May 2025 12:00 PM IST
Jagan Remains Silent Amid Series of Local-Level Setbacks
X

వ‌రుస పరాజ‌యాలు ఎదుర‌వుతున్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం త‌న మౌనాన్ని వీడడం లేదు. ఎక్క‌డా పార్టీపై ఒక్క స‌మీక్ష కానీ.. ఒక్క దూకుడు చ‌ర్చ‌కానీ. ఆయ‌న చేప‌ట్ట‌డం లేదు. తాజాగా మడకశిర నగర పంచాయతీలో వైసీపీకి చెందిన చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 14 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజుకు మద్ధతుగా నిలిచారు.

ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంలో కౌన్సిలర్లతో పాటు నరసింహరాజుకు స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు మద్దతు తెలిపారు. మొత్తం 15మంది మద్దతుతో మడకశిర నగర పంచాయతీపై పసుపు జెండా రెపరెపలాడింది. మడకశిర నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో చేరింది.

ఇక‌, చీరాల‌, క‌డ‌పలు కూడా ఇప్ప‌టికే టీడీపీ కూట‌మి వ‌స‌మ‌య్యాయి. మ‌రోవైపు.. మైదుకూరులోనూ మునిసిప‌ల్ చైర్మ‌న్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. కీల‌క‌మైన ఈ స్థానాల‌న్నీ.. ఇలా చేజారిపోవ‌డం ఒక ఎత్త‌యితే.. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి బల‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న మాచ‌ర్ల‌లోనూ.. కిశోర్‌కుమార్ చైర్మ‌న్ ప‌ద‌వి పోయింది. అన‌ధికారిక‌కంగా.. కౌన్సిల్ భేటీలు నిర్వ‌హించార‌న్న వాద‌న‌తో ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఇవ‌న్నీ వైసీపీకి క్షేత్ర‌స్థాయిలో ఘోర ప‌రాజ‌యాలు.

ఇలా.. వ‌రుస‌గా రెండు రోజుల నుంచి ఇన్ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నా.. జ‌గ‌న్ మాత్రం పెదవి విప్ప‌డం లేదు. బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న బెంగ‌ళూరులో ఉన్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, జ‌కియాఖానుం కూడా పార్టీ మారిన విష‌యం తెలిసిందే. ఇలా.. ఉంటే పార్టీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఎక్క‌డా నోరు విప్ప‌డం లేదు. దీనిపై వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.