మళ్ళీ పాదయాత్ర... జగన్ సంచలన ప్రకటన వెనక ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటనను వైసీపీ యూత్ లీడర్ల సమీక్షా సమావేశంలో ప్రకటించారు
By: Tupaki Desk | 1 July 2025 6:06 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటనను వైసీపీ యూత్ లీడర్ల సమీక్షా సమావేశంలో ప్రకటించారు. డేట్ టైం చెప్పలేదు కానీ పాదయాత్ర కచ్చితంగా ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు. ఆయన పార్టీ యువజన విభాగం నాయకులతో మాట్లాడుతూ తాను జిల్లాల పర్యటనలు చేస్తూ ఉంటాను అని చెప్పారు. అదే సమయంలో పాదయాత్ర కూడా చేస్తాను అని జగన్ కీలక ప్రకటన చేశారు.
రాబోయే ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేస్తానని జగన్ స్పష్టం చేశారు. అంతే కాదు పార్టీ సోషల్ మీడియా వింగ్ ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈ రోజులలో ఫోన్ ఒక బ్రహ్మాండమైన ఆయుధమని ఆయన యువతకు చెప్పారు.
పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో వెంటనే పోస్ట్ చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఇక తాను చేపట్టబోయే పాదయాత్రలో సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కలుస్తానని వారిని పేరు పేరునా పిలుస్తాను అని జగన్ చెబుతూ వారిలో హుషార్ కలుగజేశారు.
ఇవన్నీ పక్కన పెడితే తాజాగా జగన్ చేసిన ప్రకటనతో ఏపీలో మరో భారీ పాదయాత్ర అన్నది తధ్యమని అర్ధం అవుతోంది. ఇక జగన్ పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి కాదు, ఆయన 2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వరకూ ఏకంగా పదిహేను నెలల పాటు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర ఏపీ అంతా తిరిగారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా జగన్ పాదయాత్ర సాగింది.
ఆ పాదయాత్ర ఫలితమే ఆయనకు 2019 ఎన్నికల్లో 151 సీట్లను అందించింది. ఆయన ప్రజలతో మమేకం అయిన తీరుకు మంచి స్పందన లభించింది. ప్రజల మధ్య నుంచే తన ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని చెప్పి ఆనాడు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల నుంచే తన నవరత్నాల పధకాలను తయారు చేశారు. వాటికి మంచి స్పందన లభించడం తోనే ఆయన అధికారం అందుకున్నారు.
నిజం చెప్పాలంటే వైసీపీ రాజకీయ ప్రస్థానంలో జగన్ పాదయాత్ర ఒక మైలురాయిగా ఉంటుంది. మరి అలాంటి పాదయాత్ర మరోసారి చేస్తాను అని జగన్ అంటున్నారు. ఈసారి ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే జగన్ 2017లో పాదయాత్ర చేసినపుడు ఆయన సీఎం కాలేదు. ఆయన పాలన గురించి ఎవరికీ తెలియదు. ఈసారి ఆయన పాలన మీద ఒక అభిప్రాయం అయితే ఉంది.
అయితే జగన్ పాదయాత్రలో పాల్గోనే వర్గాల బట్టి రూట్ మ్యాప్ బట్టి ఆయన ఈసారి టార్గెట్ చేసేది ఏమిటి అన్నది అర్ధం అవుతుంది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు వైసీపీకి బలంగా ఉంటాయి. అందువల్ల ఆయన పాదయాత్ర ఆ విధంగా డిజైన్ చేస్తారా అన్న చర్చ ఉంది.
ఇక ఎన్నికలకు చాలా దూరం ఉంది. గట్టిగా నాలుగేళ్ళ పాటు ఉంది. అందువల్ల జగన్ పాదయాత్ర గురించి ప్రకటించారు కానీ బహుశా అది 2027 చివరిలో ఉండవచ్చు అని అంటున్నారు. అంటే 2029 మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చు అని చెబుతున్నారు. పాదయాత్రలో జన సమూహాలతో కలవాలని అనుకుంటుండం వల్లనే ఇప్పటి నుంచే పెద్దగా ప్రజల వద్దకు వెళ్ళడం లేదని చర్చ సాగుతోంది.
ఈ రోజునే అందరికీ కలిస్తే ఆనాటికి ఆ ఊపు తగ్గుతుందని వూహంతోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. అంతే కాదు జిల్లాల పర్యటనలు కూడా పరిమితంగా చేసుకుంటూ ఈ రెండేళ్ళ పాటు మెల్లగా వైసీపీ రధాన్ని ముందుకు పోనీయాలని కూడా ప్రణాళిక ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఏపీలో పాదయాత్రలు ఎపుడూ సక్సెస్ అవుతూనే వచ్చాయి. పాదయాత్ర చేసిన వారికి అధికారం దక్కింది. అది వైఎస్సార్ చంద్రబాబు, జగన్ లోకేష్ ఇలా అందరూ పాదయాత్ర చేసి పదవులు అందుకున్న వారే. దాంతో మరోసారి పాదయాత్ర అని జగన్ అంటున్నారు. మరి ఏపీ రాజకీయాల్లో ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తొందో చూడాలి.
