అసెంబ్లీకి జగన్ & కో... ఆసక్తికరంగా ‘డిజిటల్ అటెండెన్స్’!
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
By: Raja Ch | 11 Feb 2026 11:49 AM ISTనేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అనంతరం సభను వాయిదా వేసి బిజినెస్ అడ్వైజరీ కమీటీ సమావేశం నిర్వహించి.. ఈ సమావేశాలు ఎన్ని దినాలు జరపాలి, ఏయే అంశాలపై చర్చించాలనే విషయాలను ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు!
అవును... బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన పార్టీ సభ్యులతో సహా అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో భాగంగా... ప్రధానంగా "రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలి", "నిరుద్యోగ భృతి ఇవ్వాలి", "ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి" అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
ఇదే సమయంలో... "ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ", "తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి" వంటి అంశాలపైనా.. "ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం - దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం" అంటూ నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి జగన్ తో పాటు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు. మరోవైపు.. జగన్ & వైసీపీ ఎమ్మెల్యేలు.. "వారు ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నిలదియ్యనివ్వరు" అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వైసీపీకి నిజంగా ప్రజా సమస్యలపై తమ డిమాండ్లు వినిపించాలనుకుంటే.. ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే.. ప్రభుత్వం తప్పులను ప్రజల ముందు ఎత్తి చూపాలంటే అందుకు అసెంబ్లీకి మించిన వేదిక ఉండదు! కానీ... అనర్హత వేటుపై ఆందోళనతోనో లేక మరో కారణంతోనో నేడు అలా అసెంబ్లీకి వచ్చి, అటెండెన్స్ వేయించుకున్న అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో వారి ఇంటెన్సన్ పై కామెంట్లు వినిపిస్తున్నాయి!
అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్!:
ఇటీవల కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేసి, అటు నుంచి అటు వెళ్లిపోతున్నారనే విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా... ఇకపై సభ్యుల హాజరు అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా జరగనుంది. అంటే.. సభ్యులు అసెంబ్లీకి వచ్చి లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి హాజరు నమోదు అవ్వనుందన్నమాట. ఈ కొత్త విధానాన్ని స్పీకర్ ఈ సమావేశాల నుంచి మొదలుపెట్టారు! దీంతో.. ఈ విషయం ఆసక్తిగా మారింది!
