రెంటపాళ్ల రాజకీయం.. వైసీపీకి ప్లస్సా.. మైనస్సా ..!
ప్రధానంగా ఈ పర్యటన ద్వారా రెండు విషయాలు బలంగా తెలిసాయి. వైసీపీకి నాయకులు అదేవిధంగా కార్యకర్తల బలం అయితే స్పష్టంగా తెలుస్తుంది.
By: Tupaki Desk | 20 Jun 2025 6:00 AM ISTగుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ నాయకుడు మాజీ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య జరిగి ఏడాది అయిన తర్వాత వైసిపి అధినేత జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలిసింది. అయితే ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు జగన్ చేసిన వ్యాఖ్యలు కూటమి నాయకులు చేసిన ఎదురుదాడి వంటివి పరిశీలిస్తే రెంటపాళ్ల రాజకీయం ఏ మేరకు వైసీపీకి ప్లస్సు అయ్యింది ఏ మేరకు మైనస్ అయింది అనేది ఆసక్తిగా మారింది.
ప్రధానంగా ఈ పర్యటన ద్వారా రెండు విషయాలు బలంగా తెలిసాయి. వైసీపీకి నాయకులు అదేవిధంగా కార్యకర్తల బలం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ కోసం మేము ఉన్నామం టూ బయటకు వచ్చే వారి సంఖ్య వేలు కాదు లక్షల్లోనే ఉందని తాజా పర్యటన స్పష్టం చేసింది. ఇదే సమయంలో జగన్ కోసం అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమే అన్నట్టుగా నాయకులు వ్యవహరించడం కూడా కనిపించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అదే సమయంలో కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. ఇది ఒక రకంగా పార్టీకి బలం ఉంది అని నిరూపించుకునేందుకు లేదా తమ శక్తి తగ్గలేదని చెప్పుకునేందుకు ఉపయోగపడే కీలక అంశం. ఇది ఒక రకంగా పార్టీకి ప్లస్. అయితే ఇదే సమయంలో కార్యకర్తలు వ్యవహరించిన తీరు `రఫ్ఫా రఫ్ఫా` అంటూ తలలు నరికేస్తామంటూ రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామంటూ వారు ఏర్పాటు చేసిన బ్యానర్లు వంటివి మాత్రం వివాదానికి దారి తీశాయి. వీటివల్ల కుండెడు పాలలో చుక్క విషం కలిపిన తీరుగా పరిస్థితి మారింది.
ఎంత మంది జనం వచ్చారు ఎంత సక్సెస్ చేశారు అనేది పక్కకు పోయి కేవలం వారి ఏర్పాటు చేసిన బ్యానర్లు వాటిపై రాసిన వివాదాస్పద రాతలు మాత్రమే ప్రచారంలోకి వచ్చాయి. తద్వారా పార్టీకి భారీ మైనస్ ఏర్పడింది. కార్యకర్తలు ఉండడం పార్టీలకు మంచిదే. అసలు కావాలి కూడా. కానీ ఇదే సమయంలో వారిని సరైన విధానంలో వినియోగించుకోవాల్సిన అవసరం సరైన విధానంలో వారిని లైన్లో పెట్టుకోవాల్సిన అవసరం పార్టీలకు నాయకులకు ఎంతైనా ఉంది. ఈ విషయంలో తేడా జరిగితే మాత్రం ఎంత కష్టపడి పనిచేసినా.. ఎంత కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకున్న అది సక్సెస్ కావడం కష్టం.
ఈ రెండు విషయాల్లో మాత్రం జనం వచ్చారు కాబట్టి సక్సెస్ అయిందని చెప్పచ్చు. కానీ ఇదే జనాలు చేసినటువంటి చిన్న చిన్న పనులు మొత్తం కార్యక్రమానికి మైనస్ గా మారాయి. జగన్ చూసిన నేపథ్యంలోనే అంత బలమైన వ్యాఖ్యలతో తలలు నరికేస్తాం అని బ్యానర్లు కట్టడం ఫ్లెక్సీలు కట్టడం అనేది చోటుచేసుకుంది ఇది పార్టీకి మంచిది కాదు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాన్ని ఆకర్షించాలి అంటే ఇలాంటి బయోత్పతాలు కల్పించే బ్యానర్లు ఫ్లెక్సీలకు అవకాశం లేకుండా పార్టీ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తే ఉన్న కార్యకర్తలు.. నాయకులు.. పార్టీకి బలంగా మారతారు.
