Begin typing your search above and press return to search.

బాబు లెక్కకు అందని జగన్ లెక్క !

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటు షేర్ 40 నుంచి 34 శాతానికి పడిపోయిందని చంద్రబాబు వెల్లడించారు. అయితే 2024 ఎన్నికలతో పోలిస్తే తమ పార్టీ ఓటింగ్ శాతం పెరిగిందని జగన్ చెబుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే ఆశించిన ఓట్లు రాలేదని ఆరోపించారు. ఇద్దరి వాదనలపై స్పష్టత రావాలంటే 2029 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

By:  Satya P   |   12 Nov 2026 8:51 AM IST
బాబు లెక్కకు అందని జగన్ లెక్క !
X

ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ ఏకంగా ఆరేడు శాతం పడిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ గణాంకాలను అన్నింటినీ ఆయన చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓటు షేర్ వస్తే 2026 స్థానిక సంస్థల ఎన్నికలో అది కాస్తా 34 శాతానికి దిగజారిందని బాబు స్పష్టంగా చెప్పారు. వైసీపీని జనాలు తిరస్కరించారని అదే సమయంలో కూటమి ఓటు షేర్ పెరిగిందని దాంతో పాతిక శాతం దాకా వైసీపీ టీడీపీ కూటమిల మధ్య భారీ గ్యాప్ ఉందని కూడా బాబు విశ్లేషించారు.

ఆ లెక్క కాదంటూ :

అయితే బాబు చెప్పిన లెక్క కాదంటున్నారు వైసీపీ అధినేత జగన్. తమ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు షేర్ పెరిగింది అని తాజాగా తాడేపల్లి లో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో జగన్ చెప్పడం విశేషం. 2024 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్‌ శాతాలు ఎక్కడికక్కడ బాగా పెరిగాయని అన్నారు. అదే ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే వైసీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్‌ శాతం నమోదు అయ్యేదని జగన్‌ చెప్పడం విశేషం. ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు కూటమి చేసిందని అందుకే వైసీపీకి ఓట్ల శాతం ఇంకా రావాల్సి ఉన్నా ఆగిందని అన్నారు. నిజంగా వైసీపీకి భారీగా ఓటు శాతం పెరిగితే తన ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని చంద్రబాబు ఎన్నికలు సాఫీగా కాకుండా చూశారు అని జగన్ విమర్శించారు.

ఎవరి లెక్క కరెక్ట్ :

ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ఒకలా జగన్ మరోలా రియాక్షన్ ఇచ్చారు. బాబుది గెలుపు కాదని జగన్ అంటే వైసీపీ పతనం అయింది అని బాబు అన్నారు. వైసీపీ ఓటు షేర్ తగ్గిపోయింది అని బాబు అంటే ఇన్ని అక్రమాలు చేసినా ఓటు శాతం పెరిగింది అని జగన్ అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అంటే ఇద్దరి ఆలోచనలూ వేరు ఇద్దరి సమాచారాలూ వేరు, ఇద్దరి దృక్కోణాలూ వేరు అన్నదే జవాబుగా వస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జగన్ అంటున్నారు. ప్రశాంతంగా జరిగాయని బాబు అంటున్నారు. చెల్లని ఓట్లుగా వైసీపీ ఓట్లు తీసి పక్కన పెట్టేశారు అని జగన్ చెబుతున్నారు. ఇలా ఎవరి వాదన వారికి ఉంది. ఎవరి ధీమా కూడా వారికి ఉంది. అందుకే తమ వాదనే కరెక్ట్ అని ఇద్దరూ అంటున్నారు.

జనమే తేల్చాలి :

అందుకే ఈ స్థానిక ఎన్నికల పోరుని పక్కన పెడితే అసలు ఎన్నికల్లో జనాలు తేల్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారు అన్నది స్పష్టం అవుతుందని అంటున్నారు. అంతవరకూ ఎవరి వాదనలు అయినా జనాలు వినాల్సిందే అని కూడా అంటున్నారు. నిజానికి ఎన్నికల్లో గెలుపు అన్నది ఎపుడూ అంకెల మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆ అంకెలలో గారడీలు ఉన్నాయని వైసీపీ అంటోంది. కాబట్టి ఇది ఇప్పటికి అయితే తేలని వ్యవహారంగానే చూడాలని అంటున్నారు. సో 2029 దాకా వెయిట్ అండ్ సీ.