జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ?
ఆయన ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశారు అని కీలక నాయకుడని పైగా ప్రాణ హాని ఉందని అంటోంది
By: Tupaki Desk | 11 May 2025 2:30 AMవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి అత్యున్నత భద్రత కావాలని వైసీపీ కోరుకుంటోంది. ఆయన ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశారు అని కీలక నాయకుడని పైగా ప్రాణ హాని ఉందని అంటోంది. జగన్ గత పదకొండు నెలలుగా జనంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలో భద్రతా పరమైన లోపాలు కనిపించారని కనీసం ఆయనకు మంచి వాహనాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వలేదని కూడా ఆరోపిస్తున్నారు.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుకు లోకేష్ కి కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చారని జగన్ కి ఎందుకు ఇవ్వరని వారు అంటున్నారు. 2018 అక్టోబర్ లో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిందని గుర్తు చేస్తున్నారు. జగన్ కి ప్రజాదరణ హెచ్చు అని ఆయన జనంలోకి వస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమని అంటున్నారు.
దాంతో జగన్ కి సెక్యూరిటీ పెంచాల్సిందే అన్నది వైసీపీ మాట. జగన్ అయితే స్వయంగా ఇదే విషయం మీద తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది దీని మీద వాదిస్తూ జగన్ విపక్షంలోకి రాగానే ఆయనకు కనీస మాత్రం సమాచారం లేకుండా పూర్తి స్థాయిలో భద్రత తగ్గించారని ఆయన అన్ని విధాలుగా జెడ్ ప్లస్ సెక్యూరిటీకి అర్హుడని పేర్కొన్నారు.
రాజకీయాల్లో ఉన్న వారు ప్రజా జీవితంలో ఉన్న నేతలకు భద్రతాపరమైన సమస్యలు ఉంటాయని అందువల్ల జగన్ కి సెక్యూరిటీ కోరి అడిగినపుడు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఆ దిశగా ఆలోచించడం లేదు అని కూడా పేర్కొన్నారు. దీని మీద స్పందించిన హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
వైఎస్ జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు కల్పించకూడదు అని కూడా కోర్టు పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయమని కేంద్ర హోం శాఖ ఇంటెలిజెన్స్ ఇతర భద్రతా విభాగాలకు అలాగే ఏపీలోని హోం శాఖ విభాగానికి నోటీసులు జారీ చేసింది.
మరి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన కౌంటర్ దాఖలు చేస్తాయో చూడాల్సి ఉంది. ఇక ఈ కేసు విచారణను వేసవి సెలవుల అనంతరం జూన్ జరిపేందుకు వాయిదా వేసింది. దీంతో మరోసారి జగన్ భద్రత విషయం చర్చకు వచ్చింది. జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ లభిస్తుందా లేదా అన్నది జూన్ లో జరిగే విచారణ అనంతరం తేలుతుంది.
జగన్ కి జెడ్ ప్లస్ భద్రత కల్పించడానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి నిబంధనలు ఏమి చెబుతున్నాయి. ఆయనకు ప్రాణ హాని నిజంగా ఉందా ఈ విషయాల మీద కూడా విచారణ సందర్భంగా ఇరు వైపులా వాదనలు సాగనున్నాయి. మొత్తానికి ఈసారి జగన్ జిల్లా పర్యటనలు పూర్తి స్థాయి జెడ్ ప్లస్ సెక్యూరిటీ మధ్యనే జరుగుతాయని వైసీపీ వర్ఘాలు అయితే ధీమాగా ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.