పవన్ పేరు జగన్ ఎందుకు ఎత్తట్లేదు... !
పవన్‌ను విమర్శించినంత వరకు .. యువత వైసీపీకి దూరంగా ఉంది. అంతేకాదు..కీలకమైన కాపు నాయ కులు, ఆ సామాజిక వర్గం కూడావైసీపీకి దూరమైంది.
By: Tupaki Desk | 30 May 2025 7:00 AM ISTవైసీపీ అధినేత జగన్.. కళ్లు తెరుచుకున్నారా? రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలో తెలుసుకు న్నారా? ఎవరిని కదపాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే విషయాలపై క్లారిటీ వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. గత ఎన్నికలకు ముందు.. గత ఏడాది నుంచి జగన్ రాజకీయాలను చూసుకుంటే.. స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జనసేన అధినేత ను టార్గెట్ చేసుకున్నారు.
తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా పెళ్లిళ్లు.. సంసారాలు అంటూ.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత లైఫ్‌పై కూడా టార్గెట్ చేశారు. అయితే.. గత ఏడాది నుంచి మాత్రం ఎక్కడా పవన్‌ను విమర్శించడం లేదు . పైగా.. తనంతట తాను ఎక్కడా పవన్ పేరు కూడా పలకడం లేదు. దీనికి కారణం.. పవన్‌ను విమర్శించ డం వల్ల... ఉన్న ఓటు బ్యాంకును కూడా పోగొట్టుకుంటున్నామన్న కీలక నాయకుల సూచనేనని తెలిసింది.
పవన్‌ను విమర్శించినంత వరకు .. యువత వైసీపీకి దూరంగా ఉంది. అంతేకాదు..కీలకమైన కాపు నాయ కులు, ఆ సామాజిక వర్గం కూడావైసీపీకి దూరమైంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించింది. గాజువాక వంటి నియోజకవర్గంలో పార్టీ పతనా వస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా పవన్ పాటే పాడితే.. మరింత ఇబ్బందులు వస్తాయన్న సీనియర్ల సూచనలను జగన్ పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. రాజకీయ ప్రత్యర్థి విషయంలోనూ జగన్ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబును మాత్రమే జగన్ విమర్శిస్తున్నారు. ఆయన పాలనను, పోలీసుల వైఖరిని మాత్రమే తప్పుబడుతున్నారు. అంటే.. బాబు టార్గెట్ గా చేసుకుని.. పవన్‌ను వదిలేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ పవన్ పేరు కానీ.. ఊరు కానీ వినిపించ లేదు. కేవలం చంద్రబాబు చుట్టూ మాత్రమే రాజకీయం నలుగుతోంది. అంటే.. మొత్తంగా పవన్ అంటే భయమైనా అయి ఉండాలి.. లేకపోతే.. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబేనని గుర్తించైనా ఉండాలని అంటున్నారు.
