Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌.. ఆయ‌నెవ‌రికీ అర్ధంకాడు అంతే ..!

ఏపీ మాజీ సీఎం జగన్ తనకు తానే ప్రత్యేకం. ఎవరు మాట వినరు. ఎవరు చెప్పింది వినరు. తనకు తోచిందే మాట్లాడతారని పార్టీ నాయకులే చెప్పేవారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 4:00 AM IST
జ‌గ‌న్‌.. ఆయ‌నెవ‌రికీ అర్ధంకాడు అంతే ..!
X

ఏపీ మాజీ సీఎం జగన్ తనకు తానే ప్రత్యేకం. ఎవరు మాట వినరు. ఎవరు చెప్పింది వినరు. తనకు తోచిందే మాట్లాడతారని పార్టీ నాయకులే చెప్పేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించకుండానే కేవలం ఒకరిద్దరు చెప్పిన విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆయన కీలక విషయాలపై నిర్ణయాలు ప్రకటించారు. ఆ తర్వాత అవి వివాదాస్పదం కావడం, హైకోర్టుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడం ప్రభుత్వానికి సంబంధించిన కీలక అధికారులు సైతం హైకోర్టుకు వెళ్లి వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు అధికారం పోయింది మరి పద్ధతి ఏమైనా మారిందా, లేక ఆయన తనదైన శైలిలోనే ఉన్నారా అంటే ఏమాత్రం మార్పు రాలేదనేది సొంత పార్టీ నాయకులు చెబుతున్న మాట. దీంతో ఒక క్రమ పద్ధతిలో రాజకీయాలు చేయాలని భావించే నాయకులు వైసిపికి దాదాపు దూరమైపోతున్నారు. వీరందరికీ జగన్ అంటే ఇష్టం లేక కాదు. జగన్ అంటే అభిమానం లేక కాదు. వైఎస్ కుటుంబం అంతే ప్రేమ లేక కాదు. కానీ జగన్ తనకు తానే ప్రత్యేకంగా భావిస్తుండడం తాను మాట్లాడిందే కరెక్ట్ అని అనుకోవడం వంటివి వీళ్ళకి నచ్చడం లేదు.

వాస్తవానికి చంపుతాం నరుకుతామంటూ ప్లకార్డులు పెడితే.. ఏ పార్టీ మాత్రం సహిస్తుంది, అది యువతకు ఎలాంటి సందేశాలను ఇస్తుంది, అనేది పదవ తరగతి విద్యార్థిని అడిగినా చెబుతాడు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి వ్యతిరేకం. ఎన్నైనా రాసుకోవచ్చు ప్రభుత్వం పనిచేయడం లేదని రాసుకోవచ్చు. లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని రాయచ్చు. ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ చంపుతాం నరుకు తాం. మేము అధికారంలోకి వస్తే తాటతీస్తాం. తోలుతీస్తాం. అంటే ఇది యువతకు కానీ పార్టీ నాయకులు కానీ సరైన విధానం కాదు.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయానికి కారణం ఇలాంటి దూకుడు వ్యాఖ్యలు. ఇలాంటి బూతులే అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించేందుకు ఆ పరిస్థితి నుంచి పార్టీని గెలిచే దిశగా నడిపించేందుకు జగన్ ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ ఆయన ఆ మార్గాన్ని ఆ దారిని వదిలేసి చంపేస్తాం నరికేస్తాం రప్ప రప్ప తలలు నరికేస్తాం అని యువకులు వ్యాఖ్యానిస్తే వాటిని సమర్థించటం, తప్పేంటి అని ప్రశ్నించటం ఆయన నైజాన్ని బయటపెట్టింది.

ఇది దీర్ఘకాలంలో పార్టీకి ఇబ్బంది కలిగిస్తుంది. బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. వారి వాయస్‌కు బలం ఉంది. వారు చెప్తే వినే ప్రజలు ఉన్నారు. రాసే మీడియా ఉంది. అలాంటప్పుడు జగన్ ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. జగన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయాన్ని ఆయన వదిలేసి తనకు తానే స్పెషల్ అనుకున్నట్టుగా వ్యవహరించడం ద్వారా తాను మునిగిపోతూ తనవారిని ముంచేస్తున్నారన్న వాదనైతే వినిపిస్తోంది.