రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. విషయం ఏంటంటే!
అంటే.. ఏ ప్రభుత్వానికైనా కూడా.. కొంత సమయం పడుతుంది. నిర్ణీత వ్యవధిలో అమలు చేసేందుకు సర్కారుకు కొంత టైం తీసుకుంటుంది.
By: Tupaki Desk | 26 Jun 2025 8:45 AM ISTవైసీపీ అధినేత జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని పేరే రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో. తరచుగా కూటమి సర్కారుపై ఒంటికాలిపై లేస్తున్న జగన్.. ఇటీవలరెండు పర్యటనలు చేశారు. ఈ రెండు పర్యటనల్లోనూ యువత జోరుగా వచ్చారు. అయితే.. దీనిని బలుపు అనుకుంటున్నారో.. లేక ఏమనుకుంటున్నారో.. తెలియదు కానీ.. వైసీపీ వైపే జనాలు ఉన్నారని.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృత స్తాయి సమావేశంలో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అదే.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో. అంటే.. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను తిరిగి ప్రజలకు గుర్తు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనిని ఐదు వారాల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. వాస్తవానికి ఏడాది కాలంలోనే అన్నీ అయిపోతాయని అనుకుంటే పొరపాటే. జగన్ కూడా అమ్మ ఒడి పథకాన్ని ఏడాది తర్వాతే ప్రారంభిం చారు. విద్యాదీవెనను కూడా ఏడాదికి అటు ఇటుగా ప్రారంభించారు. నాడు-నేడు కార్యక్రమాన్ని కరోనా అనంతరం.. అంటే రెండేళ్ల తర్వాత చేపట్టారు. ఇక, పింఛన్ల పెంపును రూ.250 చొప్పున కూడా ఏడాది తర్వాతే చేపట్టారు.
అంటే.. ఏ ప్రభుత్వానికైనా కూడా.. కొంత సమయం పడుతుంది. నిర్ణీత వ్యవధిలో అమలు చేసేందుకు సర్కారుకు కొంత టైం తీసుకుంటుంది. ఈ విషయం తెలిసి కూడా.. జగన్ తొందరపడుతున్నారన్న వాదన సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తుండ డం గమనార్హం. ఇప్పటికిప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేసినా.. ప్రజలు లైట్ తీసుకుంటారు. ఇంకా నాలుగు సంవత్స రాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే తొందర ఎందుకని ఇటీవల నిర్వహించిన రెండు సర్వేల్లో కూడా ప్రజలు తేల్చి చెప్పారు. అలాంటప్పుడు వైసీపీ చేపట్టే కార్యక్రమానికి ఏమేరకు స్పందన ఉంటుందన్నది ప్రశ్నార్థకం.
ఇదిలావుంటే.. నాయకులు, కార్యకర్తలు.. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ ఆదేశించారు. కానీ, అసలు విస్తృత స్థాయి కీలక సమావేశానికే సగం మంది కూడా హాజరు కాలేదు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద కార్యక్రమానికి ఎంత మంది వస్తారన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. దీనిని బట్టి నాయకులకు మార్కులు వేస్తామని కూడా జగన్ చెప్పుకొచ్చారు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటారా? ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల సమయం ఉన్ననేపథ్యంలో ఎంత మంది ముందుకు వస్తారో చూడాలి.
