Begin typing your search above and press return to search.

ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ.. ఫస్ట్ టైం జగన్ రియాక్షన్!

ఇందులో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపైనా జగన్ ఆకట్టుకునే సమాధానమిచ్చారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   21 May 2026 8:00 PM IST
ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ.. ఫస్ట్ టైం జగన్ రియాక్షన్!
X

రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నమ్మదగిన వ్యక్తి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారంటూ ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి మొదటిసారి స్పందించారు. లండన్ పర్యటన అనంతరం తాడేపల్లి వచ్చిన జగన్మోహనరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా మాట్లాడిన జగన్ చివర్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపైనా జగన్ ఆకట్టుకునే సమాధానమిచ్చారని అంటున్నారు.

"రాజకీయాల్లో బాబు కంటే జగనే నమ్మదగిన వ్యక్తి" అంటూ అమిత్ షా చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ బాగా ట్రోల్ అవుతుందని మీడియా ప్రశ్నించగా, జగన్ స్పందిస్తూ.. అవును ఎవరి నోట విన్నా ఇదే నిజం చెబుతారు. ‘‘అది ఆయన (అమిత్ షా) చూసిన ఎక్స్ పీరియన్స్. చంద్రబాబును చూశారు, జగన్ ను చూశారు. చంద్రబాబు పాలన, జగన్ పాలనకు మధ్య తేడాను చూశారంటూ జగన్ వ్యాఖ్యానించారు. అమిత్ షానే కాదు ప్రజలు అంతా ఇదే అనుకుంటున్నారని ముక్తాయించారు.

ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఓ విశ్లేషణ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జనసేన అంతర్గత వ్యవహారాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందిస్తూ, మాజీ సీఎం జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నాదెండ్ల కలిశారని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు. ఆ సమయంలో అమిత్ షా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అజెండాకు మీరెందుకు సహకరిస్తున్నారని, రాజకీయాల్లో జగన్ మాత్రమే నమ్మదగిన వ్యక్తి అంటూ అమిత్ షా చెప్పారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వీడియోలో తెలిపారు. దీంతో ఈ అంశంపై కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రొఫెసర్ వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల ఖండించినప్పటికీ, వైసీపీ సోషల్ మీడియా మాత్రం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై జగన్ తాజా వ్యాఖ్యలు సైతం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయని అంటున్నారు.

అందుకే 11 సీట్లు..

కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందనపై జనసేన పార్టీ ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయింది. జగన్ పాలన చూసిన అమిత్ షా గారే కాదు ప్రజలు కూడా ఇదే అనుకుని 11 సీట్లకు పడగొట్టారు’ అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా తన ట్వీట్ కు ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చేసిన విమర్శల వీడియోను జత చేసింది. 2024 ఎన్నికల సమయంలో కూటమికి మద్దతుగా హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. అప్పట్లో జగన్ అసమర్థపాలన, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, కేంద్ర నిధుల దుర్వినియోగంపై అమిత్ చేసిన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వీడియోను జనసేన పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఉంచింది.