అన్న ప్యాలెస్ నుంచి బయటకు వస్తున్నాడు!
టీడీపీకి, ఆ పార్టీ దివంగత నేత పరిటాల రవి ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పే రాప్తాడులో జగన్ త్వరలో పర్యటించనున్నారు.
By: Tupaki Desk | 1 April 2025 1:50 PM ISTఏపీలోని ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ జగన్ వైఖరిపై రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నాలుగు గోడల మధ్య, ప్రత్యర్థుల విమర్శల ప్రకారం ప్యాలెస్ లలోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారని అంటారు. పైగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వైఖరి మారినట్లు లేదని చెబుతున్నారు!
గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ.. ఇటీవల ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వీలైనంత ఎక్కువ సమయం ప్రజల్లో ఉండాలని.. కార్యకర్తలకు చేరువగా ఉండాలని చెబుతుంటారు. అయితే.. ఏదైనా ప్రమాదం జరిగితేనో, దాడుల్లో తమ కార్యకర్తలు మరణిస్తేనో తప్ప ఆయన దర్శన భాగ్యం దొరకడం లేదనే చర్చలు వినిపిస్తున్నాయి.
జగన్ ప్రతిపక్షంలోకి వెళ్లినప్పటి నుంచీ బెంగళూరు ప్యాలెస్ లోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతున్నట్లున్నారనే ప్రచారమూ నెట్టింట మొదలైదని చెబుతున్నారు. ఈ సమయంలో.. వీలైనంత ఎక్కువగా జగన్ జనాల్లో ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ మరోసారి జనాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా.. త్వరలో రాప్తాడులో కనిపించనున్నారు.
అవును... టీడీపీకి, ఆ పార్టీ దివంగత నేత పరిటాల రవి ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పే రాప్తాడులో జగన్ త్వరలో పర్యటించనున్నారు. త్వరలోనే రాప్తాడు వస్తానని.. స్థానిక పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త లింగమయ్య కుమరుడితో జగన్ చెప్పారు. దీంతో... అన్న ప్యాలెస్ నుంచి బయటకు రాబోతున్నారంటూ (సెటైరికల్) పోస్టులు దర్శనమిస్తున్నాయి.
కాగా... ఇటీవల జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో వైసీపీ - టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... వైసీపీ ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఈ గొడవల నేపథ్యంలోనే పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్యపై దాడి జరగడం.. దీంతో ఆయన చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అయితే.. ఈ దాడి చేసింది టీడీపీ నేతలేనని, పరిటాల ఫ్యామిలీ మెంబర్సే ఈ దాడిలో స్వయంగా పాల్గొన్నారని వైసీపీ నుంచి విమర్శలు రాగా... తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని పరిటాల సునీత ప్రకటించారు.
ఈ సమయంలో వైసీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా.. రాప్తాడు నియోజవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడితో చనిపోయిన కురబ లింగమయ్య కుటుంబానికి జగన్ అండగా నిలిచారని.. ఇందులో భాగంగా... లింగమయ్య భార్య, ఇద్దరు కుమారులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారని చెబుతూ.. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
అయితే... రాప్తాడుకు ఆయన ఎప్పుడు వెళ్తారు.. వెళ్లిన తర్వాత తిరిగి తాడేపల్లికి వస్తారా.. లేక, మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్తారా అనే చర్చా అప్పుడే మొదలైందని చెబుతున్నారు.
