జగన్‌కు ఇది చక్కని ఛాన్స్...!
వైసీపీ అధినేత జగన్‌కు ఇప్పుడు రెండు చాన్సులు లభించాయి.
By: Garuda Media | 1 Sept 2025 11:00 PM ISTవైసీపీ అధినేత జగన్‌కు ఇప్పుడు రెండు చాన్సులు లభించాయి. ఒకటి పార్టీపరంగా ఆయనకు దక్కిన ఛాన్స్ అయితే.. రెండోది.. అసెంబ్లీ రూపంలో లభించిన అవకాశం. ఈ వ్యవహారంపై వైసీపీలోనూ చర్చ సాగుతోంది. ప్రజల మధ్యకు వచ్చేందుకు ఇంతకు మించిన సమయం దక్కదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ జనంలోకి వస్తే మంచి గుర్తింపు అదే విధంగా మంచి సమయంలో వచ్చారన్న వాదన కూడా బలపడే అవకాశం కనిపిస్తుంది అని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇప్పటికే ఆలస్యం అయిపోయిందన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట. అంతేకాదు ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తాలు చూసుకోవడం కూడా సరికాదన్నది వారి వాదన. జగన్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది జూలై తరువాత గాని ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ అప్పటివరకు వెయిట్ చేయడం సరికాదు అన్నది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆ ప్రభుత్వం మంచి మార్కులు సంపాదించుకుం టోంది.
ఇది పెరిగితే వైసీపీకి నష్టం అన్నది నాయకులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తప్పులను ఎత్తు చూపేందుకు ప్రజలకు అండగా నిలబడేందుకు జగన్ రాకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవు తాయని చెబుతున్నారు. ఇక రెండో విషయం.. అసెంబ్లీ. ఈ విషయానికి వచ్చేసరికి గత ఏడాదిన్నర కాలంలో జగన్ రెండుసార్లు మాత్రమే సభకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ సభకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి కాలం గడిపేస్తున్నారు. ఇది సరికాదన్నది సొంత పార్టీ నాయకులు కూడా చెబుతున్న మాట.
ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా సభకు రావాలని మరోసారి విన్నవించారు. సభకు వస్తే సమయం ఇస్తామని చెప్పారు. అంతేకాదు సభకు రాకుండా ప్రశ్నలు అడిగితే అనుమతించేది లేదని కరాకండీగా తేల్చేశారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ప్రశ్నలు అడిగితే అది వైసీపీకి మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించుకుని దానిని మరింత విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు ఆలోచన.
ఈ సమయంలో జగన్ ఇంట్లో కూర్చోవడం వల్ల పార్టీ ప్రభావం మరింత డైలమాలో పడుతుందని వారు సూచిస్తున్నారు. ఇప్పుడు దక్కిన అవకాశం మరోసారి దక్కక పోవచ్చు అనేది కూడా వారు చెబుతున్న మాట. కాబట్టి ఇగోలు పక్కనపెట్టి సభకు వచ్చి సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఉన్న గ్రాఫ్‌ను కాపాడుకోవడం లేకపోతే పెంచుకోవటం అనేది నిర్ణయించుకోవాలని సీనియర్ నాయకులు సైతం తేల్చి చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
