వామ్మో జగన్ శత్రు సైన్యం ఎంత దుర్భేద్యం!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఈ సూత్రం వర్తించడం లేదు.
By: Tupaki Desk | 18 April 2025 3:00 AM ISTరాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఈ సూత్రం వర్తించడం లేదు. జగన్ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన నుంచి ఆయనకు రాజకీయ శత్రువులు పెరుగుతున్నారే కానీ, మిత్రులైన శత్రువులు ఒక్కరూ కనిపించడం లేదన్న విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో జగన్ మిత్రులుగా కొనసాగిన వారు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ భారతంలో అభిమన్యుడిలా పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఆయనతో రాజకీయంగా విభేదించిన వారితోపాటు ఆయన వద్ద పనిచేసిన వారు.. కలిసి తిరిగిన వారు కూడా మాజీ సీఎంపై బాణాలు ఎక్కుపెడుతుండటం చర్చకు తావిస్తోంది. సీఎం స్థాయిలో పనిచేసిన నేతను వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ ఆయన టార్గెట్ గా నడుచుకుంటామని బాహారంగా ప్రకటించడం కూడా కొత్త సంస్కృతికి నిదర్శనంగా చెబుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల చేసిన ప్రకటనతో మాజీ సీఎంపై రాజకీయ శత్రువులు మూకుమ్ముడిగా దండెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ వ్యక్తిగత శత్రువులుగా చూడరు. కానీ, మాజీ సీఎం జగన్ విషయంలో చాలా మంది ఆయన తమకు వ్యక్తిగత శత్రువుగా చెప్పుకోడానికి ప్రాధాన్యమివ్వడమే చర్చనీయాంశమవుతోంది. ఇందులో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు. మాజీ సీఎం జగన్ బాధితుల తరఫున పోరాడుతానని ఏబీవీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలను అద్దం పడుతోందని అంటున్నారు. జగన్ సీఎంగా ఉండగా, ఐపీఎస్ అధికారి అయిన ఏబీవీని సస్పెండ్ చేయడంతోపాటు ఆయనకు ఐదేళ్లపాటు జీతంగా చిల్లిగవ్వ కూడా చెల్లించకపోవడంతో జగన్ ను తన శత్రువుగా ఏబీ వెంకటేశ్వరరావు పరిగణిస్తున్నారని చెబుతున్నారు. ఏబీవి ఒక్క కాదు జగన్ హయాంలో పనిచేసిన కొందరు అఖిల భారతస్థాయి అధికారులు ఆయన బాధితులుగా ఇప్పుడు బాణాలు ఎక్కు పెడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారిలో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ తన దుందుడుకు శైలితో కొందరు న్యాయమూర్తులతోనూ విభేదాలు తెచ్చుకున్నారని అంటున్నారు.
సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ న్యాయమూర్తి విషయంలో కూడా జగన్ అనవసర యాగీ చేయడంతో ఇప్పుడు ఆయన కూడా మాజీ సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన ప్రత్యర్థి పార్టీలో రాజకీయాలు చేస్తున్న వారు ఎప్పుడూ శత్రువులుగానే యుద్ధం చేస్తున్నారని అంటున్నారు. తాను సీఎంగా ఉండగా, ప్రత్యర్థులను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహం పనిచేయకపోవడంతో వారంతా ఇప్పుడు కట్టకట్టుకుని యుద్ధానికి వస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీలో ముఖ్యనేతలు అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణరెడ్డి వంటివారు సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు.
ఇక తొలి నుంచి తనతో కలిసి నడిచిన వారిని శత్రువులుగా మార్చుకుని మరింత ముప్పు ఎక్కువయ్యేలా మాజీ సీఎం జగన్ వ్యవహారముందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో జగన్ తోపాటు బయటకు వచ్చి, వైసీపీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరూ ఇప్పుడు జగన్ తో లేరని అంటున్నారు. సొంత కుటుంబ సభ్యులైన తల్లి, చెల్లితోపాటు అప్పట్లో జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామక్రిష్ణ, మోపిదేవి వెంకటరమణ వంటివారు ఆయనకు దూరంగా ఉండటం కూడా రాజకీయంగా జగన్ కి పెను ముప్పుగా చెబుతున్నారు. ఇలా జగన్ వ్యతిరేక శక్తులు అన్నీ కలిపి చూస్తే ఆయన దుర్బేధ్యమైన శత్రు సైన్యంతో పోరాడుతున్నారని, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కగలరనేదే ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.
