పదవులు ఇవ్వడం కాదు.. ఫీడ్ బ్యాక్ తీసుకో జగన్..?
గతంలో జగన్ పార్టీ నేతలకు ఆ అవకాశం ఇవ్వలేదు. కనీసం మంత్రులు చెప్పింది కూడా ఆయన పట్టించుకోలేదు.
By: Tupaki Desk | 16 April 2025 7:00 AM ISTప్రాంతీయ పార్టీల్లో పదవులు ఇవ్వడం ముఖ్యం కాదు... వారికి ఆ పదవుల్లో ఎంత పవర్ ఇచ్చాం ... వారికి ఆ పదవుల ద్వారా ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాం అన్నదే ఇంపార్టెంట్. గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు నేతల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి... అందుకోసం పార్టీ అధినేతలు వారితో ఎప్పటికప్పుడు సమావేశమై.. వారి సలహాలు.. సూచనలు తీసుకోవాలి... వారి సూచనలు బాగుంటే క్షేత్రస్థాయిలో అమలు చేయవచ్చు... అప్పుడే వాస్తవ పరిస్థితులు పసిగడతారు... ఇక నిజాలు నిర్భయంగా అధినేతకు చెప్పుకునే వెసులుబాటు కూడా ఉండాలి.. నాయకుల దగ్గర నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ వినకుండా.. వారిని భయపెడుతూ రాజకీయం చేస్తే అది పార్టీకి ఎప్పటకి అయినా ఇబ్బందే అవుతుంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్థానిక నాయకులకే ఎక్కువుగా తెలుస్తుంది.. అందుకే వారి ఫీడ్‌బ్యాక్ అధిష్టానానికి ఎప్పుడూ ముఖ్యం. వారిని విస్మరించినా.. కార్యకర్తలను పట్టించుకోకపోయినా పార్టీలు ఎలా నష్టపోతాయో 2019లో తెలుగుదేశానికి, 2024లో వైసీపీకి ఎరుకే. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పార్టీలో అనేక పదవులు భర్తీ చేశారు. పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో ఏకంగా 33 మంది సీనియర్ నేతలకు అవకాశం కల్పించారు. ఇది బాగానే ఉంది. ఎంత ఎక్కువ మంది ఉన్నా.. వారు చెప్పే సమాధానాలు.. వారు ఇచ్చే సలహాలు చాలా ఓపికగా వినాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది.
గతంలో జగన్ పార్టీ నేతలకు ఆ అవకాశం ఇవ్వలేదు. కనీసం మంత్రులు చెప్పింది కూడా ఆయన పట్టించుకోలేదు. సజ్జల లాంటి ఒకరిద్దరు నేతల మీదే ఆయన పూర్తిగా ఆధారపడిపోయారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల దెబ్బతిన్నామని.. కార్యకర్తలు తమ అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఏ మంత్రి కూడా క్షేత్రస్ధాయిలో పార్టీకి ఉన్న ఇబ్బందులు చెప్పే ప్రయత్నం చేసినా జగన్ వినిపించుకోలేదు. తన లెక్కలు తనవే అన్నట్టుగా ఏకపక్ష ధోరణితో వెళ్లిపోయారు. అందుకే ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చూడాల్సి వచ్చింది.
ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి అంతా తాడేపల్లి నుంచి నడిపిస్తే ఏం జరుగుతుందో జగన్‌కు మొన్న ఎన్నికల్లో బాగా తెలిసి వచ్చింది. వలంటీర్ల వ్యవస్థతో జనానికి మేలు జరిగినా కార్యకర్తలతోనూ, ఎమ్మెల్యేలతోనూ ప్రజలకు గ్యాప్ పెరిగిందన్న విమర్శలు బాగా వినిపించాయి. అది ఎన్నికల ఫలితాల్లోనూ తెలిసింది. అందుకే ఇప్పుడు జగన్ 33 మంది నేతలతో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నియమించినా.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుందే తప్పా లేకపోతే దీని వల్ల నో యూజ్ అని పార్టీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.
