తగ్గేదేలే అంటున్న పోలీసు అధికారుల సంఘం.. మాజీ సీఎం జగన్ ను వదిలిపెట్టమంటూ వార్నింగ్
మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సీరియస్ అవుతోంది. మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ పోలీసులను బట్టలూడదీసి నిలబెడతానంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారుతోంది.
By: Tupaki Desk | 9 April 2025 4:35 PM ISTమాజీ సీఎం జగన్ పై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సీరియస్ అవుతోంది. మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ పోలీసులను బట్టలూడదీసి నిలబెడతానంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారుతోంది. జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ ఘాటుగా స్పందించగా, మహిళా పోలీసులు సైతం నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే అంశంపై స్పందించిన రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తామంటూ హెచ్చరించింది.
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య నేపథ్యంలో హతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల మెప్పుకోసం పోలీసులు వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించిన ఆయన తాను మళ్లీ సీఎం అవగానే పోలీసులను బట్టలూడదీసి నిలబెడతానంటూ హెచ్చరించారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీసు అధికారుల సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్రలోని శివసేన నేత సంజయ్ రౌత్ కూడా గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోర్టుకు ఈడ్చామని, ఇప్పుడు జగన్ విషయంలోనూ న్యాయపోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది.
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన పోలీసు అధికారుల సంఘం, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పోలీసు అధికారుల సంఘం జగన్ పై కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తుందని అంటున్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను సభ్యసమాజం ఆలోచించాలని అన్నారు. ‘‘బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అంటూ ప్రశ్నించారు. పోలీసు ఉద్యోగులుగా మహిళలూ ఉన్నారన్న విషయాన్ని మాజీ సీఎం మరచిపోయారా? అంటూ నిలదీశారు.
