పాదయాత్రే అధికార సంజీవని.. జగన్ ఆలోచన ఇదే..
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రకటన రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Desk | 2 July 2025 10:20 AM ISTమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రకటన రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మంగళవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యవజన విభాగం సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్రతోనే కనీవినీ ఎరుగని విజయం సాధించిన జగన్.. మళ్లీ తాను సీఎం అవ్వాలంటే పాదయాత్ర మాత్రమే సంజీవనిగా పనిచేస్తోందని నమ్ముతున్నారని అంటున్నారు.
2011లో తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో కేవలం అమ్మ విజయమ్మ మాత్రమే తనతో ఉన్నారని చెప్పిన జగన్.. అప్పట్లో యువత మద్దతుతోనే తాను నాటి ప్రభుత్వాలపై ఒంటరి పోరాటం చేశానని గుర్తు చేశారు. అందుకే 2019 ఎన్నికల్లో ఎక్కువ మంది యువతకు సీట్లు కేటాయించి ఎమ్మెల్యేలుగా గెలిపించానని చెప్పారు జగన్. ఇప్పుడు కూడా యువతకు పార్టీలో ప్రాధాన్యమిస్తానని, తనకు మద్దతుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వ మోసాలను తెలియజేసేందుకు యువజన విభాగంలోని నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారదిలా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రజల గొంతుకగా మారాలని యువజన కార్యకర్తలకు కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
పార్టీలో యువతను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతానని చెప్పిన జగన్, ప్రాంతాల వారీగా యూత్ వింగుకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తానని వెల్లడించారు. ఇక జగన్ ప్రకటించిన పాదయాత్రపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడాదికే ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే జగన్ పాదయాత్ర ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా నిర్ణయం కాలేదు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించిన జగన్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యటించాక పాదయాత్ర మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
అంటే ప్రతి నెలా రెండు జిల్లాల్లో పర్యటించినా, జిల్లాల పర్యటనలు ముగిసేసరికి దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఏడాది గడవడం, జిల్లాల పర్యటనకు మరో ఏడాది పూర్తయితే కూటమి ప్రభుత్వంపై పూర్తి స్పష్టత వస్తుందని, అప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ కార్యక్రమాన్ని రూపొందించవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర 2027 నవంబరు-డిసెంబరు మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
