ఈసారి అందరినీ ఒకే దెబ్బతో...జగన్ స్ట్రాటజీ !
వైసీపీ అధినేతకు అధికారంలోకి వచ్చేందుకు రెండు బాగా కలిసి వచ్చాయి. అవి ఒకటి భారీ పాదయాత్ర.
By: Tupaki Desk | 12 May 2025 4:49 AMవైసీపీ అధినేతకు అధికారంలోకి వచ్చేందుకు రెండు బాగా కలిసి వచ్చాయి. అవి ఒకటి భారీ పాదయాత్ర. అలాగే రెండవది సంక్షేమ పధకాలు. ఇస్తామంటే కాదనేది ఏవరు. ఉచితాలు అంటే వ్యామోహం లేనిది ఎవరికి. అందుకే జగన్ అధికారం మీద గంపెడాశలు పెంచుకుంటూ ఉన్నారు. 2024 నాది కాకపోవచ్చు. కానీ 2029 మాత్రం నాదేనని ఆయన గట్టిగా చెబుతున్నది కూడా అందుకే.
ఈసారి ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ళ ముందే జగన్ పాదయాత్రకు సిద్ధపడుతున్న సంగతి విధితమే. అయితే ఈ పాదయాత్రలో జగన్ అన్ని వర్గాలతో మరోమారు మమేకం కావాలని చూస్తున్నారుట. జనం వద్దకు వెళ్ళేందుకు వారితో కలసిపోయేందుకు పాదయాత్రకు మించిన ఆయుధం లేదని జగన్ అనుకుంటున్నారు.
సరే పాదయాత్ర చేస్తారు మరి జగన్ ఇచ్చే హామీల సంగతి ఏమిటి అంటే అవి 2019 కంటే రెట్టింపు అంటున్నారు. పైగా ఆనాడు ఆయన విస్మరించిన కొన్ని వర్గాలను ఈసారి కచ్చితంగా టచ్ చేస్తారుట. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారిని బుట్టలో వేసుకునేందుకు ఆయన ఆకర్షణీయమైన హామీలను కూడా ఆలోచిస్తున్నారుట.
కేవలం పేద వర్గాలే అంటే వారికే ఉచితాలు అంటే పన్నులు కట్టే వారు మధ్యతరగతి దూరం అవుతున్నారు అని గ్రహించిన జగన్ ఈసారి ఆ చాన్స్ వారికి ఇవ్వదలుచుకోలేదు అంటున్నారు. మధ్యతరగతి వర్గాలు ఓటింగులో ఎంతో ప్రభావం చూపుతారని వారి ఆలోచనలు రాజకీయ పార్టీల గెలుపు ఓటముల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయని వైసీపీ అధినాయకత్వానికి ఎట్టకేలకు తెలిసింది అని అంటున్నారు.
అందుకే వారికి ఏమి అవసరాలు ఉన్నాయో ఈసారి పాదయాత్రలో పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణంగానే తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో రూపొందించుకుంటారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే అగ్ర వర్ణాలు కూడా వైసీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ వర్గాల వల్ల కూడా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది.
అందువల్ల వారిని సైతం కలుపుకుని పోవడానికి జగన్ ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈసారి పాదయాత్రలో అగ్రవర్ణాల ప్రజానీకానికి కూడా భారీ హామీలే ఉంటాయని అంటున్నారు. పేరుకు అగ్ర వర్గాలు కానీ వారిలో అత్యధికులు పేదలుగా ఉన్నారని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. దాంతో వారికి సైతం గట్టి మేలు తలపెట్టే పధకాలకు శ్రీకారం చుట్టాలని వాటిని హామీలుగా పాదయాత్రలో ఉంచాలని ఆయన ఆలోచిస్తున్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట.
మొత్తం మీద చూస్తే కనుక జగన్ ఈసారి పాదయాత్రలో హామీల వరద రీసౌండ్ చేస్తుందని అంటున్నారు. పాదయాత్ర 2.0 అయితే జగన్ 2.0 గా మారితే ఆయన మార్క్ సంక్షేమం కూడా 2.0గానే ఉంటుందని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా తెచ్చుకోవాలో ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలను వేసుకుంటున్న వైసీపీ అధినేత పాదయాత్ర పేరుతో పాదం మోపేందుకు కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అని అంటున్నారు.