తగ్గేదేలే.. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విపక్ష హోదా కోసం న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.
By: Tupaki Desk | 24 Sept 2025 3:31 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విపక్ష హోదా కోసం న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఆరు నూరైనా ప్రభుత్వం దిగిరావాల్సిందేనని జగన్ పట్టుబడుతున్నారు. సభలో రెండే పక్షాలు ఉన్నాయని, అందులో ఒకటి అధికారపక్షం, ఇంకొకటి ప్రతిపక్షం కనుక వైసీపీకి విపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ తన పిటిషన్ లో కోరినట్లు చెబుతున్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేష్ చట్టంలోని సెక్షన్ -12Bకి విరుద్ధంగా పరిగణించాలని జగన్ హైకోర్టును వేడుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆయన విన్నవించారు. ఇందులో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ను ప్రతివాదులుగా చేర్చారు.
గతంలోనే మాజీ సీఎం జగన్ తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జులైలో జగన్ కోర్టును ఆశ్రయించగా, ఆ తర్వాత జగన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ మంగళవారం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ప్రభుత్వంపై న్యాయపోరాటం ద్వారా ఒత్తిడి పెంచేలా జగన్ వ్యవహరిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జగన్ వేసిన పిటిషన్ లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైఖరిని తప్పుపడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని తమ పార్టీ అడగడాన్ని అసమంజసమైన కోరికగా స్పీకర్ పేర్కొన్నారని, అందులో భాషను పరిశీలిస్తే తనకు ప్రతిపక్షనేతగా గుర్తించకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతోందని ఆరోపించారు. న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షమనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేష్ చట్టంలోని సెక్షన్ -12Bలో ప్రతిపక్ష నేతను నిర్వచించారని, దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు తాను అర్హుడినని జగన్ స్పష్టం చేశారు. కాగా, ఈ వాజ్యంపై వాదనలు జరిగిన, తర్వాత కోర్టు నిర్ణయం వెలువడనుంది. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
