జగన్ ఓదార్పు యాత్ర 2.0!
ఓదార్పుకూ ఒక యాత్ర ఉంటుందని దానికి కూడా ఎంతో పవర్ ఉంటుందని నిరూపించిన వారు వైఎస్ జగన్.
By: Tupaki Desk | 8 April 2025 5:02 PM ISTఓదార్పుకూ ఒక యాత్ర ఉంటుందని దానికి కూడా ఎంతో పవర్ ఉంటుందని నిరూపించిన వారు వైఎస్ జగన్. జగన్ ని జనాలకి కనెక్ట్ చేసినదే ఓదార్పు యాత్ర. అలాగే కాంగ్రెస్ నుంచి వేరు చేసినది కూడా అదే ఓదార్పు యాత్ర. ఈ యాత్ర నుంచే జగన్ రాజకీయంగా ఎదిగారు.
ఆయన ప్రతీ కుటుంబం వద్దకు వెళ్ళి వారి ఇంటి మనిషిగా వ్యవహరిస్తూ నేల మీద కూర్చుని మాట్లాడుతూ వారు ఏమి పెడితే అది తింటూ జనం మనిషిగా మారిపోయారు. జగన్ మావాడు అని ఏపీ జనం అలా గుండెల్లో పెట్టుకున్నారు.
అది జగన్ పాలిటిక్స్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. మళ్ళీ చాలా కాలానికి అలాంటి దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ పర్యటించి వైసీపీ నేత అయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నేల మీద కూర్చుని వారు చెప్పేది శ్రద్ధగా విన్నారు. వారితో సొంత మనిషిగా వ్యవహరించి అన్నీ పంచుకున్నారు.
వారికి అండగా ఉంటానని చెప్పారు. దాంతో వారంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాయకుడి నుంచి ఇది కదా కావాల్సింది అని వైసీపీ కార్యకర్తలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇక బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. దాంతో చాలా కాలం తరువాత ఫైర్ బ్రాండ్ జగన్ ని చూశామని క్యాడర్ అంటున్నారు.
ఇక రాప్తాడు టూర్ ఆరంభం మాత్రమేనని కూటమి చేతిలో ఇబ్బందులు పడుతున్న వారు, కేసులతో అవస్థలు పడుతున్న వారికి జగన్ అండగా ఉంటారని అంటున్నారు. దాంతో జగన్ రానున్న రోజులలో కార్యకర్తల ఇంటికి ఓదార్పు యాత్రలు చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికి పుష్కర కాలం క్రితం జగన్ చేసిన ఓదార్పు యాత్ర తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిన వారు చనిపోయిన వారిని పరామర్శించారు.
అలా జనం వద్దకు వెళ్ళారు. ఇపుడు కార్యకర్తల వద్దకు జగన్ పరామర్శలకు వెళ్తారా అన్న కొత్త చర్చ సాగుతోంది జగన్ జనాల్లోకి రావాలని అనుకుంటున్నారు. అయితే ఇపుడే ప్రజా సమస్యల మీద రోడ్లెక్కి నిరసనలు చేపట్టడం అంటే తొందరపాటే అవుతుందని అంటున్నారు.
దాంతో తమ సొంత పార్టీ క్యాడర్ ని నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి వెళ్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి. జగన్ సైతం ప్రతీ నియోజకవర్గానికి రెండు మూడు రోజులు కేటాయిస్తాను అని గతంలో చెప్పారు. క్యాడర్ తోనే మీటింగులు పెడతాను అని అన్నారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ వల్ల ఇబ్బందులు పడిన వారిని సైతం ఆయన పరామర్శిస్తారని అంటున్నారు. మొత్తం మీద జగన్ మార్క్ ఓదార్పు యాత్ర-20 తొందరలోనే స్టార్ట్ అవుతుందా అంటే పార్టీ వర్గాలు మాత్రం ఆశాభావంతో ఉన్నాయని అంటున్నారు.