జగన్ నెక్స్ట్ టూర్ నెల్లూరు...అంతా రెడీనా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటించారు.
By: Tupaki Desk | 16 July 2025 6:00 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటించారు. మామిడి రైతులను ఆయన పరామర్శించారు. ఇక జగన్ బంగారుపాలెం టూర్ ఎంతలా రచ్చ చేసిందో తెలిసిందే. అనుమతులు కొందరికే ఇచ్చినా వేలాదిగా జనాలు రావడం పోలీసులు కేసులు పెట్టడం ఒక వైపు జరిగిపోతోంది. అయినా సరే జగన్ పర్యటనలు ఆగడం లేదు. ఇక చూస్తే జగన్ బంగారుపాలెం పర్యటన కంటే ముందే నెల్లూరు టూర్ ఉండాల్సింది. అయితే హెలికాప్టర్ దిగేందుకు సేఫ్ ప్లేస్ లేదని వాయిదా వేసుకున్నారు.
ఈలోగా చాలా పరిణామాలు జరిగిపోయాయి. కోవూరు మాజీ మంత్రి వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ఇంటి మీద దుండగులు దాడి చేయడం వంటివి జరిగి రాజకీయంగా రచ్చగా సాగింది. అయితే జగన్ నెల్లూరు వెళ్లాలని అనుకున్నపుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని సబ్ జైలులో పరామర్శించడం అన్నది ఉంది.
ఇపుడు ప్రసన్నకుమార్ రెడ్డిని కూడా కలుస్తారు అని ప్రచారంలో ఉంది. ఆయన ఇంటి మీద దాడి జరగడంతో స్వయంగా ఆ వివరాలు తెలుసుకుంటారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే తాజాగా నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం భూముల సేకరణ చేపడుతున్నారు. ఇక ఇండోసోల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తోంది.
అయితే తమ భూములు ముక్కారు పంటలు పండేవని సారవంతమైన భూములు అని రైతులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దాంతో అక్కడ గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతాంగం భూములను ఇవ్వమని తీవ్రంగా ప్రతిఘటించండంతో ఇది ఒక ఇష్యూగా మారుతోంది.
తాజాగా కరేడు గ్రామానికి చెందిన రైతులు వైసీపీ అధినేత జగన్ కి తాడేపల్లిలో కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ తరఫున పోరాటం చేయాలని వారు కోరారు తమ గ్రామానికి వచ్చి పరిస్థితి చూడాలని ఆహ్వానించారు. దాంతో జగన్ నెల్లూరు టూర్ ఖరారు అయినట్లే అంటున్నారు. వరసగా చూస్తే జగన్ ఇప్పటిదాకా మిర్చీ పొగాకు, మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఇపుడు భూసేకరణలో భూములు వదులుకోమని ఉద్యమిస్తున్న రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
తొందరలోనే జగన్ నెల్లూరు పర్యటన ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ తమాషా ఏంటి అంటే ఇండోసోల్ కంపెనీ అధినేత జగన్ కి బినామీ గతంలో టీడీపీ సహా కూటమి పెద్దలు ఆరోపించారు. అనాడు ఈ కంపెనీని వ్యతిరేకించిన కూటమి పెద్దలే ఇపుడు అనుకూలంగా మారి భూసేకరణకు పచ్చ జెండా ఊపితే జగన్ ఎదురు నిలిచి పోరాడేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. మరి మారిన ఈ రాజకీయంలో రైతుల పాత్ర మాత్రం నాడూ నేడూ ఒక్కటిగానే ఉంది. తమ భూములే వారికి కావాలని అంటున్నారు. మరి రైతుల ఆశలు తీరుతాయా లేక రాజకీయ సమరంగానే ఇది ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.
