జగన్ గడప దాటాల్సిందే !
ఇటీవల రైతాంగం విషయంలో ఆయన కూటమి ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. రైతులను ఆదుకోవడం లేదని వారు అన్యాయం అయిపోతున్నారని కూడా అన్నారు.
By: Tupaki Desk | 7 May 2025 7:30 AMవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గడప దాటాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది. జగన్ గత పది నెలలుగా బెంగళూరు టూ తాడేపల్లి గానే షటిల్ సర్వీస్ చేస్తున్నారు అన్నది కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ జనంలోకి వెళ్ళమని దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇటీవల రైతాంగం విషయంలో ఆయన కూటమి ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. రైతులను ఆదుకోవడం లేదని వారు అన్యాయం అయిపోతున్నారని కూడా అన్నారు. రైతులకు పరామర్శించి వారి కష్టాలను తెలుసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చారు.
అయితే దానికి పెద్దగా స్పందన అయితే రాలేదని అంటున్నారు. అంతే కాదు పార్టీ మీదని జిల్లా అధ్యక్షులకు చెప్పినా వారు కూడా చురుకుదనం తీసుకుని రాలేకపోతున్నారు. జనంలో మమేకం కావాలని జగన్ ఇస్తున్న సందేశం అయితే నాయకులు పట్టించుకోవడం లేదు.
వైసీపీలో ఒక రకమైన అభద్రతాభావం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతల మీద కేసులు ఉన్నాయి. కొంతమందిని జైలు పాలు చేసారు. మరి కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. ఇంకొంతమంది తన వంతు ఎపుడు వస్తుందో అని ఆలోచనలో ఉన్నారు. ఏ మాట మాట్లాడితే ఏమి వస్తుందో తమ మీద కూటమి పెద్దలు ఫోకస్ పెడతారేమో అన్నది కూడా వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా చేస్తోంది.
అయితే జగన్ మాత్రం నాయకులు కదలాలని కోరుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నపుడు గడప గడపకూ మన ప్రభుత్వం అని ఒక కార్యక్రమం ఇచ్చినా దానిని అంతా తూతూ మంత్రంగానే చేశారు. దాని ఫలితమే పార్టీ ఘోర పరాజయం. వైసీపీని ఏకశిలా సదృశ్యంగా జగన్ నిర్మించారు. ఆ పార్టీకి సర్వస్వం జగన్ గనే ఉంది. ఆయన చుట్టూనే పార్టీ తిరుగుతోంది.
దాంతో జగన్ లేకపోతే ఆయన పరోక్షంగా ఎవరూ నా బొందో అని పనిచేయడానికి ముందుకు రావడం లేదని తేలిపోయింది అంటున్నారు. జగన్ ఉన్నారని ఆయనే గెలిపిస్తారని పార్టీ అంతా భారమేసి కూర్చున్న నేపథ్యం వైసీపీలో ఉంది అని అంటున్నారు.
దాని వల్లనే పార్టీలో పై నుంచి దిగువ దాకా ఎవరూ అనుకున్న స్థాయిలో రెస్పాండ్ కావడం లేదని అంటున్నారు. ఇక చూస్తూనే ఏడాది కాలం గడచిపోతోంది వైసీపీ ఇప్పటికైనా జనంలో కనిపించాల్సి ఉంది అని అంటున్నారు. మిగిలిన పార్టీల మాదిరిగా వికేంద్రీకరణ విధానంలో నడపాలని చూసినా ఆ తరహా ప్రయోగాలు చేసినా వైసీపీకి అవి నప్పవని అంటున్నారు. పార్టీని అలా ఇన్నేళ్ళ పాటు నడిపారు అంతా కేంద్రీకృతం చేసుకున్న తరువాత నాయకులు కూడా జగన్ వైపే చూస్తున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద ఏతా వాతా చెప్పొచ్చేది ఏంటి అంటే జగన్ తాడేపల్లి గడపను దాటాలి. ఆయనే జనంలోకి రావాలి. ఆయనే కార్యక్రమాలలో నేరుగా పాల్గొనాలి. అపుడే ఆయన వెంట నాయకులు వచ్చి చేరుతారు అని అంటున్నారు. అలా కాదూ కూడదు అంటే జగన్ ఆదేశిస్తూనే ఉంటారు నాయకులు మాత్రం తమకు తోచింది చేస్తూనే ఉంటారు అని అంటున్నారు. వైసీపీలో అదన్న మాట సంగతి.