జగన్ పరామర్శకు 500 మంది.. 10 కార్లు సరిపోవా బాస్?
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మీద విరుచుకుపడిన మోంథా తుపాను బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.
By: Garuda Media | 4 Nov 2025 11:36 AM ISTకార్యక్రమానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవటం మామూలే. అందుకు భిన్నంగా వైసీపీ వర్గీయులు వినిపించే వాదన విన్నప్పుడు మాత్రం విస్మయానికి గురి చేయకమానదు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మీద విరుచుకుపడిన మోంథా తుపాను బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన కోసం పర్మిషన్ కోరగా.. 500 మందికి.. 10 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన షరతుల్ని పోలీసులు విధించారు
దీనిపై వైసీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను కారణంగా దెబ్బ తిన్న పంటల్ని పరిశీలించటం..రైతులతో మాట్లాడటంతో పాటు బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చే తమ అధినేతకు ఇలా షరతులు విధించటమేమిటని మండిపడుతున్నారు. టూవీలర్లకు అనుమతి ఇవ్వకపోవటం ఏమిటి? అన్నది మరో ప్రశ్న. అయితే.. వైసీపీ వర్గీయుల ప్రశ్నల్ని చూసినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి వస్తున్నది బాధితులను పరామర్శించటానికా? లేదంటే బల ప్రదర్శనకా?అన్న ప్రశ్న కలుగక మానదు.
విపక్ష నేతగా ఉన్న వేళ ఎంత సింఫుల్ గా ఉంటే అంత మంచిది. మందిబలంతో హడావుడి చూపే కన్నా.. తమ పక్షాన నిలబడి కోట్లాడే అధినేత వస్తున్నాడన్న భావన ప్రజల్లో కలగాలే తప్పించి.. క్యాడర్ లో కాదు. భారీ ఎత్తున వాహనాల కాన్వాయ్ వెంట రాగా.. వేలాది మందితో బాధితుల పరామర్శ సాధ్యమవుతుందా? ఒకవేళ అలా చేసిన సమయంలో బాధితులకు సాంత్వన కంటే కూడా విపక్ష నేత తమ మైలేజీ కోసం తమను వాడుకున్నారన్న భావన కలిగే వీలుంది. అదే జరిగితే.. పరామర్శ కార్యక్రమంతో వచ్చే మైలేజీ పోయి.. పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
తమ అధినేత పరామర్శకు వస్తున్న వేళ.. పది కార్లకు.. 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వటాన్ని వైసీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను పోలీసులు అడ్డుకుంటున్నారని.. షరతులు.. పరిమితులు విధిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వేళలోనే జగన్ ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళితే.. హోటల్ గదిలో నుంచి బయటకు వస్తే బాగోదని.. పరిమితులు విధించటం.. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలకు విధించిన పరిమితులు.. తమకు కూడా వర్తిస్తాయన్న విషయాన్ని వైసీపీ వర్గీయులు ఎలా మిస్ అవుతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
