Begin typing your search above and press return to search.

వైసీపీ రూల్: ఆ పార్టీని ప‌ట్టించుకోవ‌ద్దు .. !

శ్రీకాళహస్తి విషయానికి వ‌స్తే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినుతి ఆమె భర్త చంద్రబాబును హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి అన్నది తాజాగా వెలుగు చూసిన వీడియో సంచలనం రేపుతోంది.

By:  Garuda Media   |   14 Oct 2025 10:00 AM IST
వైసీపీ రూల్: ఆ పార్టీని ప‌ట్టించుకోవ‌ద్దు .. !
X

వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించిన ఆయన ఒక కీలక పార్టీ విషయంలో ఎవరు మాట్లాడవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. గత నాలుగు రోజులుగా జనసేన పార్టీ వ్యవహారాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి, కురుపాం నియోజకవర్గాలలో జనసేన పార్టీ నాయకుల వ్యవహారం రాజకీయంగా చర్చకు వచ్చింది.

శ్రీకాళహస్తి విషయానికి వ‌స్తే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినుతి ఆమె భర్త చంద్రబాబును హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి అన్నది తాజాగా వెలుగు చూసిన వీడియో సంచలనం రేపుతోంది. అయితే ఈ వీడియో వాస్తవానికి నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల్లో చర్చ కూడా నడుస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన గాని ఇది టిడిపి గాని ఎక్కడ స్పందించలేదు. అయితే, దీనిపై స్పందించేందుకు వైసిపి నాయకులు సిద్ధమవుతున్న క్రమంలో ఆ పార్టీ అధినేత నుంచి జనసేన విషయంలో ఎవరు స్పందించవద్దని ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం.

దీంతో వైసిపి నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి శ్రీకాళహస్తి విషయాన్ని మాట్లాడాలని అనుకున్నప్పటికీ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఇక కురుపాంలో జనసేన ఎంపీపీ పై టిడిపి నాయకులు బహిరంగంగానే దాడి చేశారు. తీవ్ర‌స్థాయిలో కొట్టారు. అనంతరం వారే తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారం అటు టిడిపి ఇటు జనసేన పార్టీలో తీవ్ర వివాదంగా మారింది. అంతర్గతంగా జరుగుతున్న దుమారాలకి ఇది పరాకాష్టగా కూడా మారిందని వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ విషయంపై కూడా స్పందించొద్దని జనసేన విషయాల జోలికి పోవద్దని వైసిపి అధినేత జగన్ చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసిపి నాయకులు కేవలం జనసేనకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటారు? అనేది చూడాలి. అయితే.. రాజ‌కీయంగా జాతీయ‌స్థాయిలో జ‌రుగుతున్న మార్పుల కార‌ణంగానే వైసీపీ ఇలా నిర్ణ‌యించింద‌న్న వాద‌నా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.