Begin typing your search above and press return to search.

పాత వ్యూహాల్లో జగన్...వర్కౌట్ అవుతుందా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనదైన రాజకీయం చేస్తారు అని పేరు. ఆయన రాజకీయాల్లో ఎక్కడా ఎవరి దగ్గరా శిష్యరికం చేయలేదు.

By:  Satya P   |   21 April 2026 9:08 AM IST
పాత వ్యూహాల్లో జగన్...వర్కౌట్ అవుతుందా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనదైన రాజకీయం చేస్తారు అని పేరు. ఆయన రాజకీయాల్లో ఎక్కడా ఎవరి దగ్గరా శిష్యరికం చేయలేదు. ఆయన తండ్రి దిగ్గజ నేత వైఎస్సార్ ఇంట్లోనే ఉన్నా జగన్ రాజకీయం స్టైల్ వేరు అని చెబుతారు. ఆయన జనం తాను అనుకుంటారు. రాజకీయాల్లో ఇది మంచిదే అయినా అధికారానికి దగ్గర చేసేందుకు వ్యూహాలు కూడా అవసరం అని అంతా అంటారు. వైసీపీ విషయానికి వస్తే తాము అనుకున్నదే చేస్తుంది అని కూడా విమర్శలు ఉన్నాయి. తప్పులు కనుక ఉంటే సరిదిద్దుకోవడం లేదు అన్న మాట కూడా ఉంది. మూడు రాజధానుల విషయంలో బొప్పి కట్టే విధంగా జనాలు తీర్పు ఇచ్చినా మావిగాన్ పేరుతో వైసీపీ మరో ప్రతిపాదన చేయడాన్ని అంతా గుర్తు చేస్తున్నారు.

సంక్షేమంతోనే క్షేమంగా :

వైసీపీకి సంక్షేమం విషయంలో పేరు ఉంది. ఎందుకంటే అప్పు చేసైనా ఠంచనుగా జనాల అకౌంట్ లో సొమ్ము వేశారని అంటారు. అయినా సరే అదే సంక్షేమం అందుకుని భారీగా లబ్ది పొందిన వారు అంతా 2024 ఎన్నికల్లో వైసీపీని ఆదరించలేదని అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలను నమ్మి టీడీపీ కూటమికి ఓటేశారు. మరి 2029 లో జగన్ అయితే ఒక నమ్మకం మీద ఉన్నారు. తాము ఇచ్చిన మాదిరిగా సంక్షేమం కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని జనాలు అనుకుంటున్నారని అందువల్ల అదే తమని తిగిరి గట్టెక్కిస్తుందని ఎంతో ధీమాతో ఉన్నారు. ఆయన ఎపుడు క్యాడర్ తో మీటింగులు పెట్టినా సంక్షేమం గురించే ఎక్కువగా చెబుతూ వస్తున్నారు.

అభివృద్ధి నమూనా ఏదీ :

ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. ఉమ్మడి ఏపీ అయినా లేదా హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్న తెలంగాణా అయినా సంక్షేమం గురించి ఎక్కువగా చెప్పుకున్నా ఓకే కానీ ఏపీలో అలాంటివి కుదురుతాయా అన్నది చర్చ. మరో వైపు చూస్తే తటస్థులు విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు యువత అంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఏపీ ఏదో విధంగా బాగుపడితే చాలు అన్నది వారి ఆలోచనగా ఉంది. అదే సమయంలో అప్పులు చేసి పధకాలకు పంచి పెడితే ఏపీ ఏమి ముందుకు వెళ్తుంది అన్నది కూడా వారి మాటగానే ఉంది. దాంతో పధకాలు సంక్షేమం అంటూ వైసీపీ ఎంత వల్లిస్తే అంతగా ఈ వర్గాలు దూరం అవుతాయని అంటున్నారు.

ఆ ఒక్కటే కాదు కదా :

పోనీ సంక్షేమంలో వైసీపీ చాంపియన్ అని అనుకున్నా అది ఒక్కటే వైసీపీని గెలిపించదు కదా అని అంటున్నారు. ఏపీలో అనేక వర్గాలు ఉన్నాయి. ప్రాంతాలు ఉన్నాయి. వివిధ సామాజిక సమస్యలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన తీరులో ఏపీ ఉంటుంది. ఏపీలో ఓటర్లు పట్టుబట్టి పోలింగ్ బూతులకు వస్తారు. ఒకరిని గద్దెనెక్కించాలన్నా మరొకరిని దించాలన్నా వారిది అదే పంతం ఉంటుంది. అందుకే పోయిన వర్గాలను దగ్గరకు చేసుకోవాలి. మళ్ళీ ఏపీలో వైసీపీ ఎందుకు రావాలో అన్ని వర్గాలకు అవగతం అయ్యేఅలా చెప్పాల్సి ఉంది. వారి మన్నన పొందాలీ అంటే సంక్షేమ జపం తగ్గించి అభివృద్ధి మంత్రం కూడా పఠించాలి.

పాదయాత్రతోనే పవర్ :

పాదయాత్రతో అధికారం దక్కింది అన్నది వాస్తవమే కానీ ఒకే నాయకుడు రెండు సార్లు పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్న చరిత్ర అయితే తెలుగు రాజకీయాల్లో లేదు. వైఎస్సార్ ఒకేసారి పాదయాత్ర చేశారు. చంద్రబాబు కూడా ఒకసారే పాదయాత్ర చేశారు. అలా వారికి అధికారం దక్కింది. జగన్ కూడా ఒకసారి పాదయాత్ర చేస్తే పవర్ చిక్కింది. అందువల్ల మళ్ళీ పాదయాత్ర అంటే అది పాతబడిన వ్యూహంగానే ఉంటుంది అని అంటున్నారు. పైగా జనాలకు వైసీపీ ఏమి చెప్పాలనుకుంటోంది అన్నది క్లారిటీ లేకుండా 2019 నాటి హామీలు అవే నవ రత్నాలతో వస్తే మాత్రం వర్కౌట్ అవుతుందా అన్న చర్చ ఉంది. మొత్తం మీద ఏమీ అవసరం లేదు పాదయాత్ర చాలు అలాగే సంక్షేమ పధకాలు తోడుగా ఉన్నాయని వైసీపీ అధినాయకత్వం భావితోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.