మళ్లీ మీమర్లు, ట్రోలర్లకు పనిచెప్పిన జగన్ రెడ్డి! మీడియా మీట్ లో వ్యాఖ్యలు వైరల్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 20 Aug 2026 1:14 PM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను మాట్లాడాల్సిన అంశాలు అన్నీ చాలానే ఉన్నప్పటికీ ఇప్పుడు రెండు అంశాలే మాట్లాడతానని, మళ్లీ వారం మాట్లాడటానికి కొన్ని అంశాలను వాయిదా వేస్తున్నట్లు జగన్ రెడ్డి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే ఓవర్ డోస్ అయిపోతుందంటూ జగన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే సమాచారం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకో వారం కోసం ఆగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
మాజీ సీఎం జగన్మోహనరెడ్డి మీడియా సమావేశాలలో ఏదో ఒక పొరపాటు చేస్తూ ట్రోలర్లు, మీమర్స్ కి కంటెంట్ లోటు లేకుండా చేస్తారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానంటూ భీష్మించుకుని కూర్చున్న మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం అసెంబ్లీలో జరుగుతున్న డీఎస్సీపై చర్చపై మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సరిగా సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో తమ పార్టీ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సివస్తుందనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మండలి వైపు చూడటం లేదని జగన్ విమర్శలు గుప్పించారు.
డీఎస్సీపై మాజీ సీఎం చేసిన ఈ విమర్శలను రాజకీయ కోణంలో చూస్తున్న పరిశీలకులు, అదే సమయంలో ఆయన అనవసర వ్యాఖ్యలతో లేనిపోని విమర్శలు ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నాణేనికి ఇటు వైపున రెండు ప్రధాన అంశాలను టచ్ చేస్తా, టచ్ చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ.. మళ్లీ నెక్ట్స్ కూడా మళ్లీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కంటిన్యూ చేస్తా. లేదంటే ఇదే కాన్ఫరెన్సులో అన్నీ సబ్జెక్టులు తీసుకువచ్చేస్తే ఓవర్ డోస్ అయిపోతుంది’’ అంటూ జగన్ రెడ్డి చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలను మీమర్స్, ట్రోలర్లు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.
విపక్షంగా సమర్థంగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలు సిద్ధంగా ఉన్నప్పుడు ఓవర్ డోస్ అయిపోతుందని జాలి చూపడమే అంతుచిక్కడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్పీపై మంత్రి లోకేశ్ బహిరంగ చర్చకు రమ్మంటూ సవాల్ విసురుతున్నా పట్టించుకోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన ప్రెస్ మీట్ లో పాత విషయాలనే మళ్లీమళ్లీ లేవనెత్తారని అంటున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే అనేక విధాలుగా ఆందోళన చేస్తున్న వైసీపీ ఆ విషయంలో ఎంతవరకు అడ్వాంటేజ్ పొందిందో తెలియనప్పటికీ, అంతకంటే తీవ్రమైన అస్త్రాలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా వేచిచూడటం ఎందుకంటూ పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో చూడాల్సివుందని అంటున్నారు.
