అష్టదిగ్బంధనంలో జగన్.. సిట్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 17 May 2025 11:30 AM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు, ఆయన కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించిన మాజీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. దాదాపు రూ.3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన నిందితులు అంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సిట్ కేసులో అరెస్టు చేయగా, మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లిక్కర్ స్కాంలో అన్నీతానై వ్యవహరించిన ఏ1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మినెంట్ డైరెక్టరును రిమాండుకు తరలించారు. ఈ ముగ్గురి అరెస్టుతో సిట్ నెక్ట్స్ స్టెప్ బిగ్ బాసే అనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఎవరన్నది బహిరంగ రహస్యే అయినప్పటికీ, బిగ్ బాస్ ప్రమేయంపై ఆధారాలు ఎంతవరకు లభించాయనేది సస్పెన్స్ గా మారింది. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండటంతో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందని అంటున్నారు.
లిక్కర్ స్కాంలో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కళ్లు, చెవులుగా చెబుతారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు కూడా.. గత ప్రభుత్వంలో జగన్ కు ఏమైనా నేరుగా చెప్పే చనువు, సాన్నిహిత్యం మిథున్ రెడ్డికి మాత్రమే ఉండేదని అంటున్నారు. జగన్ కు కూడా మిథున్ రెడ్డిపై నమ్మకం ఎక్కువగా చెబుతారు. అలాంటి సంబంధం ఉన్న మిథున్ రెడ్డిని ఇరుకునపెడితే జగన్ ను ఇబ్బంది పెట్టొచ్చని వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ కు దగ్గర బంధువైన రాజ్ కసిరెడ్డి కూడా లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు వ్యక్తిగతంగా జగన్ ను ఇబ్బంది పాల్జేయడమేనన్న టాక్ వినిపిస్తోంది.
జగన్ బంధువు కావడం, లిక్కర్ స్కాంలో కమీషన్ల మొత్తం రాజ్ కేసిరెడ్డి ద్వారా ధనుంజయ్ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డికి చేరిందని వారిద్దరూ బిగ్ బాస్ కు అందజేశారని సిట్ లీకులిస్తోంది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఉందని పరోక్షంగా సిట్ ప్రచారం చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి జగన్ ను ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెబుతున్నారు. కానీ, ఆయన చుట్టూ ఉన్నవారిని అరెస్టు చేయడం ద్వారా జగన్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం అరెస్టు అయిన రాజ్ కసిరెడ్డి కానీ, ధనుంజయ్ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి కానీ జగన్ పేరు చెప్పే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ వ్యూహంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతానికి జగన్ ను అన్నివిధాల దిగ్బంధించాలనే నిర్ణయాన్ని మాత్రమే అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు అరెస్టు కావడంతో నెక్ట్స్ ఏంటి? అన్నదే సస్పెన్స్ గా మారింది.
