79వ స్వాతంత్ర్య సంబరాలు.. మాజీ సీఎం జగన్ ఎక్కడ?
మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్.. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీకి అధినేతగా వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Aug 2025 1:30 AM ISTమాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్.. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీకి అధినేతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆయనను సమర్థిస్తున్న 40 శాతం మంది ఓటర్లకు నాయకుడిగా గురుతర బాధ్యతల్లో ఉన్నారు. ఇంతటి క్రియాశీల బాధ్యతల్లో ఉన్న మాజీ సీఎం జగన్మోహనరెడ్డి 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా టీడీపీ సోషల్ మీడియా ఈ విషయాన్ని లేవనెత్తుతూ జగన్మోహనరెడ్డి ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తోంది. దీనికి వైసీపీ నుంచి సరైన సమాధానం కూడా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతి పౌరుడు విధి
స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశంలో ప్రతి ఒక్కరూ పండగలా జరుపుకుంటారు. మన దేశంలో కుల, మతాలకు అతీతంగా జరిగే సంబరం జాతీయ పండుగ అయిన ఆగస్టు 15, జనవరి 26 మాత్రమే. అధికారంతో సంబంధం లేకుండా ఈ రెండు జాతీయ పండుగల నాడు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఇలా ఒకటేంటి ప్రతి చోట జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి పౌరుడు విధిగా ఈ కార్యక్రమానికి హాజరు అవడాన్ని తమ బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆగస్టు 15 వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. కానీ, ఏపీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఈ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొన్న దాఖలా కనిపించకపోవడంపై ఆయన అభిమానులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
సజ్జల ఆధ్వర్యంలో జెండా వందనం
శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. పార్టీ అధినేత ఉండగా, సజ్జల జెండాను ఆవిష్కరించడంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు జగన్మోహనరెడ్డి ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియక ఆ పార్టీ కార్యకర్తలు కూడా గందరగోళాన్ని ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకు దూరంగా ఉన్న జగన్.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో మాత్రం అందరికీ శుభాకాంక్షలు చెప్పడం గమనార్హమని అంటున్నారు.
అనంతపురం నుంచి బెంగళూరుకు..
వాస్తవానికి రెండు రోజుల క్రితమే బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ గురువారం అనంతపురంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కుమారుడి వివాహానికి వెళ్లారు. అయితే అటు నుంచి మళ్లీ తాడేపల్లి రాకుండా బెంగళూరు వెళ్లిపోయారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ తాడేపల్లి వచ్చి జెండా ఆవిష్కరిస్తే బాగుండేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జాతీయ పండుగను విస్మరించి బెంగళూరు వెళ్లాల్సిన ముఖ్యమైన పని ఏంటంటూ జగన్ రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తుండటంతో వైసీపీ శ్రేణులు సమాధానం చెప్పలేకపోతున్నాయని అంటున్నారు.
సీనియర్లకు అవకాశమివ్వాల్సిందా?
మరోవైపు ముఖ్యమైన కార్యక్రమాల్లో జగన్ పార్టీ కార్యక్రమాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల సజ్జల జెండా ఆవిష్కరించారని అనుకున్నా, పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వంటి పదవులలో ఉన్న సీనియర్లను కాదని సజ్జలతో జెండా ఆవిష్కరించడంపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీలో సజ్జల నెంబర్ టు నాయకుడు అయినప్పటికీ, హోదాలో ఆయనకన్నా కీలక పదవిలో ఉన్న బొత్స వంటివారికి అవకాశం ఇస్తే బాగుండేదన్న సూచనలు వస్తున్నాయి. బొత్స ప్రస్తుతం మండలి ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదాలో ఉన్నారు. వైసీపీలో ప్రస్తుతం ఏ నేతకు ఆ హోదా లేదు. పార్టీ అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో పార్టీలో కేబినెట్ హోదా కేవలం బొత్సకు మాత్రమే దక్కింది. జగన్ అందుబాటులో లేని పక్షంలో బొత్సతో ఈ కార్యక్రమం జరిపిస్తే బాగుండేదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
బొత్సతో చేయిస్తే..
బొత్సతో జెండా ఆవిష్కరిస్తే బీసీ నేతకు గౌరవం ఇచ్చామని చెప్పుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. అదే సమయంలో బొత్స కూడా అందుబాటులో లేకపోతే మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అయినా అవకాశం ఇవ్వాల్సివుందని అంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. దీనికి కౌంటరుగా తాము మహిళా నేతలకు గౌరవిస్తామనే చెప్పుకునేలా వారితో జెండా వందనం చేయిస్తే బాగుండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మొత్తానికి ఏదిఏమైనా వైసీపీ అధినేతగా జగన్ జెండా ఎగరేస్తే ఏ వివాదం ఉండేది కాదని, కానీ ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో అనేక విమర్శలకు సమాధానం చెప్పాల్సివస్తోందని కేడర్ వాపోతోంది.
